01-07-2025 05:26:45 PM
మధురై: తమిళనాడులో లాకప్ డెత్ సంచలనంగా మారింది. శివగంగైకి చెందిన 27 ఏళ్ల ఆలయ భద్రతా గార్డు అజిత్ కుమార్ కస్టడీలో మరణించారనే ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ మంగళవారం తమిళనాడు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది. ఈ కేసులో ప్రభుత్వ చర్యలు "సరిపోలేదు" అని కోర్టు పేర్కొంటూ, దర్యాప్తులో అనేక లోపాలను ప్రశ్నించింది. విచారణ సందర్భంగా, అజిత్‌ను అదుపులోకి తీసుకున్న కేసులోనే ఆభరణాల దొంగతనంపై ప్రాథమిక ఫిర్యాదు దాఖలు చేసినప్పుడు ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని కోర్టు ప్రశ్నించింది.
ఎవరి అధికారం కింద కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేశారని బెంచ్ ప్రశ్నించింది. దర్యాప్తు ప్రారంభించడానికి ప్రత్యేక బృందానికి ఎవరు అధికారం ఇచ్చారో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) స్పష్టం చేయాలంది. అజిత్ కస్టడీలో జరిగిన సంఘటనల క్రమం గురించి కోర్టు అనేక కఠినమైన ప్రశ్నలను కూడా లేవనెత్తింది. నిందితుడిని సిసిటివి నిఘా నుండి దూరంగా ఉంచే ప్రయత్నం జరిగిందా?, అజిత్‌ను ప్రత్యేక బృందానికి ఎవరు అప్పగించారు?, రెండు రోజుల పాటు వివిధ ప్రదేశాలలోకి అతన్ని తీసుకెళ్లడానికి ఎవరు అనుమతి ఇచ్చారు?, శవపరీక్ష నివేదికను వెంటనే మేజిస్ట్రేట్‌కు ఎందుకు సమర్పించలేదో..? చెప్పాలని డిమాండ్ చేసింది.
"ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందా లేదా?" అని, పోలీసు సూపరింటెండెంట్ (SP)ని సస్పెండ్ చేయడానికి బదులుగా ఎందుకు బదిలీ చేశారని కోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ సంఘటన తర్వాత ఏపీఎస్ ఆశిష్ రావత్‌ను బదిలీ చేసి, ఏపీఎస్ జీ.చండీష్‌ను ఎందుకు నియమించారు..? అని అడిగింది. అజిత్ కుటుంబం లేవనెత్తిన ఆరోపణ అయిన కస్టోడియల్ హింస సమయంలో కారం పొడిని ఉపయోగించారా లేదా అనే విషయాన్ని ప్రత్యేకంగా తనిఖీ చేస్తూ, అతని వైద్య నివేదిక ఆధారంగా తదుపరి ఉత్తర్వులు జారీ చేస్తామని కోర్టు తెలిపింది. అజిత్ పై పోలీసులు దాడి చేస్తున్న వీడియోను రికార్డ్ చేసిన ఆలయ సిబ్బంది శక్తిశ్వరన్ ను మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
జూన్ 27న ఒక ఆభరణాల దొంగతనం కేసులో విచారణ కోసం అజిత్‌ను తీసుకెళ్లగా, మరుసటి రోజు చనిపోయాడు. పోస్ట్‌మార్టం నివేదికలో 18 గాయాలు ఉన్నాయని, కస్టడీలో హింసకు గురైనట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటివరకు, ఐదుగురు పోలీసు సిబ్బందిని అరెస్టు చేసి జూలై 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఒక సీనియర్ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.
శివగంగకు చెందిన కస్టడీ బాధితుడి కుటుంబీకులు ఈ సంఘటనకు సంబంధించి హత్య కేసుగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై మంగళవారం మద్రాస్ హైకోర్టు విచారించింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు ఆధారంగా హత్య కేసు నమోదు చేయాలని తమిళనాడు హోం కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)తో సహా ప్రతివాదులకు మాండమస్ రిట్ లేదా ఏదైనా ఇతర రిట్, ఆర్డర్ లేదా దిశానిర్దేశం జారీ చేయాలని కుటుంబం కోర్టును అభ్యర్థించింది.