calender_icon.png 22 October, 2025 | 2:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి భూముల్లో రియల్ దందా?

22-10-2025 12:00:00 AM

  1. షెడ్లువేసి అక్రమంగా అమ్మేస్తున్నారు
  2. సింగరేణి స్థలాలకు రక్షణేదీ..? 
  3. గాలిలో దీపంలా స్థలాల రక్షణ
  4. కండ్లకు కనిపిస్తున్న అధికారుల పర్యవేక్షణ లోపం

బెల్లంపల్లి అర్బన్, అక్టోబర్ 21: సింగరేణి ఖాళీ స్థలాల్లో భూ కబ్జాదారులు రియల్ దందాకు శ్రీకారం చుట్టారు. సింగరేణి స్థలాలను ఆక్రమించడమే పెద్ద నేరమైతే.. దర్జాగా వాటిని విక్రయిస్తూ లక్షల రూపాయలు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ఆక్రమిత భూముల్లో భారీ షెడ్లు వేసి విక్రయిస్తున్నా రు. ఇది ఎక్కడో కాదు. బెల్లంపల్లి శాంతిగనికి వెళ్లే 85 డీప్ ఏరియాలో విశాలమైన సింగరేణి ఖాళీ స్థలంలో గుట్టుచప్పుడుగా సాగు తోన్నమరో భూ అక్రమణ దందా ’విజయ క్రాంతి’ కంట పడింది.

85 డిప్ ఏరియాలో రైలు పట్టాలకు ఆనుకుని ఎకరాల కొద్ది సింగరేణి ఖాళీ స్థలం ఉంది. 85 డీప్ సింగరేణి క్వార్టర్ల ముందు కూడా విశాలమైన సింగరే ణి ఖాళీ స్థలంపై భూ కబ్జాదారుల కన్ను పడింది. మరోవైపు 85 డీప్ సబ్ స్టేషన్ వరకు ఖాళీగా ఉన్న స్థలం పిచ్చి మొక్కలతో ఏపుగా కనిపిస్తోంది. ఈ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించి చిన్న చిన్న షెడ్లు నిర్మించి అమ్ముతున్నారు.

పైకి చెట్ల పొదలు.., పిచ్చి మొక్కలు మాత్రమే కనిపిస్తాయి. అక్కడక్కడ ఆక్రమిత భూముల్లో హద్దుల కోసం వేసిన సిమెంట్ ఫోళ్ళు కనబడతాయి. సింగరేణి స్థలాల రక్షణకు గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఖాళీ స్థలాలు అక్రమ దారుల చేతివేటుకు గురవుతున్నాయి. వారి కనుసన్నల్లో సింగరేణి భూములు ఎప్పుడు చేతులు మారుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 

అధికారుల పర్యవేక్షణ లోపం..

సింగరేణి అధికారుల పర్యవేక్షణ లోపం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సింగరేణి సెక్యూరిటీ అధికారుల అప్రమత్తతలేమి, నిర్ల క్ష్యం నిత్యం నిఘా లోపించడం, అక్రమణదారుల పాలిట వరప్రదాయంగా మారిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవలనే బెల్లంపల్లి నడిబొడ్డున పద్మశాలి భవనం పక్కన సింగరేణి విలువైన భూమి కబ్జాకు గురైంది. ఆ స్థలాన్ని సింగరేణి అధికారులు ఇటీవలనే స్వాధీన చేసుకున్న సంఘటన మరువకముందే, బెల్లంపల్లి పట్టణం 65, 85 డీప్, శాంతిఖని బస్తీల పరిధిలోని సింగరేణి ఖాళీ భూముల కబ్జా వెలుగులోకి వచ్చింది.

బరితెగించిన కబ్జాదారులు...

పట్టణంలోని 85 డీప్ ఏరియాలోని శాంతిఖని గని ప్రధాన రహదారికి అనుకుని ఉన్న సింగరేణి ఖాళీ స్థలం గుట్టు చప్పుడు కాకుండా అన్యాక్రాంతమవుతుంది. 85 డిప్ ఏరియా వెనకాల రైలు పట్టాల పక్కన ఉన్న విశాలమైన ఖాళీ స్థలంపై కబ్జాకోర్లు కన్ను వేశారు. పదుల ఎకరాలకు పైగా అక్కడ సింగరేణి ఖాళీ స్థలం ఉంది. 85 డిప్ శివారు ప్రాంతం కావడం వల్ల కబ్జాదారుల పని సులువవుతుంది. ఆ భూములపై అధికారులకు అంతగా పర్యవేక్షణ, ప్రధాన దృష్టి ఉం డదు. సింగరేణి భూమిల్లో అక్రమంగా షెడ్లు నిర్మించి సొంతం చేసుకుంటున్నారు. అక్రమి త స్థలాల్లో ఇలా అక్కడక్కడ తమ ఆధీనంలో భూమిని ఉంచుకోవడం కోసం షెడ్లు ఏర్పాటు చేశారు. 

భయం లేకుండా పోయింది

చట్టం పట్ల కనీస గౌరవం, భయం భూకబ్జాదారుల్లో బొత్తిగా లేకుండా పోయింది. అడ్డదారిలో నాలుగు పైసలు కూడబెట్టుకోవాలనే ధ్యాసే తప్పితే  భూ అక్రమణలకు పాల్పడవద్దనే నైతిక భయం మచ్చుకు కనిపించడం లేదు. దీంతో కబ్జాదారులు బరు తెగించి సింగరేణి భూములు గుంజుకుంటున్నారు. అటు అధికారులు, ఇటు సింగరేణి యజమాన్యం ఖచ్చితమైన ఒక పాలసీ అంటూ అమలు లేకపోవడంతో భూకబ్జాదారుల్లో మార్పుకు ఆస్కారం లేదు.

భూ కబ్జాల పట్ల ఓ అధికారి ఉదాసీనత, మరో అధికారి వత్తాసు, ఇలా ఆయా కాలాల్లో అధికారుల వ్యవహార శైలి భూకబ్జాదారులకు పరోక్షంగా ఊతమిస్తుంది. ఈ నేపథ్యంలోనే భూ కబ్జాలకు అడ్డుకట్ట పెద్ద సమస్యగా పరిణమించిందనడంలో సందేహం లేదు. దాని ఫలితంగానే సింగరేణి ప్రాంతాల్లోనూ, ప్రధానంగా బెల్లంపల్లిలో అడ్డగోలుగా భూ అక్రమణల వైనం నిత్య కృత్యమని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారు లు సింగరేణి భూముల అక్రమణలు, నిర్మాణాల కట్టడిపై అధికారులు కొరడా ఝులి పించాల్సిన సమయం ఆసన్నమైందని పట్ట ణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

ఆక్రమిత స్థలాలకు ఇంటి నెంబర్లు..

ఆక్రమిత స్థలాల్లో వేసిన షెడ్లకు, కొన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు తీసుకున్నట్లు సమాచారం. తమ పలుకుబడిని వినియోగించి ఇంటి నెంబర్లు కూడా కబ్జాదారులే సమకూర్చుకుంటున్నారు. ఒక్కో ప్లాటుకు రూ.5 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. ముం దుగా షెడ్డు నిర్మించి, ఆపై బేరం కుదిరాక అప్పగిస్తున్నారు. ఇలా యథేచ్చగా ఎలాంటి ఆర్భాటం లేకుండా సింగరేణి భూముల్లో సాదాసీదాగా రియల్ వ్యాపారం సాగుతున్నది.