29-09-2025 12:00:00 AM
-నేర పరిశోధనకు అవసరమని టీజీసీబీఎస్ ప్రతిపాదనలు
-‘సెల్‌బ్రైట్’ కంపెనీకి రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా టెండర్
-ఫోన్ల అన్‌లాకింగ్‌కు సాఫ్ట్‌వేర్ కావాలంటున్న పోలీస్‌వర్గాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఓటర్ల డేటాను దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నది. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిసింది. రాష్ట్ర స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీబీఎస్) తాజాగా పోలీసుశాఖకు సంబంధించిన ఫోన్లు, ఇతర టాకింగ్ టూల్స్‌ను హ్యాక్ చేసేందుకు సాఫ్ట్‌వేర్, ఇతర సాధనాల కోసం అన్వేషిస్తున్నట్టు తెలిసింది.
దీనిలో భాగంగానే టీజీసీబీఎస్ తరఫున ఈనెల 18న రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఇజ్రాయెల్‌కు చెందిన ‘సెల్‌బ్రైట్ డీఐ లిమిటెడ్’ కంపెనీకి టెండర్ వేసినట్టు సమాచారం. టాక్ వాకర్ టూల్, సెల్‌బ్రైట్ ఇన్‌సీయెట్స్ టూల్/సాఫ్ట్‌వేర్, సైబర్ ఫోరెన్సిక్ టూల్, ఇన్‌సైట్ టూల్ తదితర రకాల సాఫ్ట్‌వేర్ కోరినట్లు తెలిసింది. ఈ అంశంపై డేటా ఎనలిస్ట్ కొడాలి శ్రీనివాస్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ‘ఈ తరహా టెండర్లు సర్వ సాధారణం. విదేశీ కంపెనీ నుంచి ప్రభుత్వం నేరుగా హ్యాకింగ్ సాధనాలు కొనుగోలు చేసి వినియోగించలేదు, కాబట్టి సరఫరాదారు నుంచే సాఫ్ట్‌వేర్ సాధనాలు సాధించాలి.
సాఫ్ట్‌వేర్ ఎందుకు అవసరమంటే ఏదైనా నేరం జరిగినప్పుడు పోలీసులు ఘటనా స్థలంలో ఫోన్లు స్వాధీనం చేసుకుంటారు. వాటిలోని డాటాను అనాలసిస్ చేయాలంటే, కచ్చితంగా ఆ గ్యాడ్జెట్స్ పాస్‌వర్డ్స్ వినియోగించాలి. పాస్‌వర్డ్స్ సేకరించే వీలు ఉండదు కాబట్టి, పోలీసులు చివరకు సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాల్సి వస్తుంది. ఇజ్రా యెల్ నుంచి సరఫరా అయ్యే ‘సెల్‌బ్రైట్’ సాఫ్ట్‌వేర్‌ను ట్రాన్స్‌ఫర్ చేసి ఫోన్లను అన్‌లాక్ చేయవచ్చు’ అని వెల్లడించారు. మరోవైపు నేరాల ఛేదనలో మెరుగైన సాంకేతికతను సమకూర్చుకోవడం సర్వసాధారణ మని, అధునాతన ఏఐ -ఆధారిత ఆటోమేషన్ వ్యవస్థను పటిష్టపరచడం కోసం సాఫ్ట్ వేర్ అవసరమని పోలీస్ వర్గాలు తెలుపుతున్నాయి. సోషల్ మీడియాపై నిఘా, నేరం జరిగిన ప్రదేశంలో స్వాధీనం చేసుకున్న పరికరాల డాటా ఎనాలిసిస్ కోసమూ సాఫ్ట్‌వేర్ ఉపయోగపడుతుందని తెలిపాయి.
ఐఫోన్‌లోకి నో ఎంట్రీ..
సెల్‌బ్రైట్ సాఫ్ట్‌వేర్ కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్‌లోకి చొరబడే అవకాశం లేదని, ఆండ్రాయిడ్ ఫోన్లలోకి సులువగా ట్రాన్స్‌ఫర్ అవుతుం దని నిపుణులు చెప్తున్నారు. వినియోగదారులు వినియోగించే సాధనాలను బట్టి వారి ఫోన్లలో డాటా భద్రంగా ఉంటుందని, ఉదాహరణకు.. ఐఫోన్‌లో ‘గూగుల్ పిక్సెల్’కు మెరుగైన భద్రతా హార్డ్‌వేర్ ఉంటుందని, అందు కే జాగృతి అధినేత్రి కవిత ఐఫోన్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డాటాను ఛేదించలేకపోయిందని వెల్లడిస్తున్నారు. కొందరు హైప్రొఫైల్ ఉద్యోగులు కేవలం డాటా భద్రత కోసమే తరచూ ఫోన్ మోడళ్లు అప్‌డేట్ చేస్తుంటారని పేర్కొంటున్నారు.