calender_icon.png 29 September, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సద్దుల బతుకమ్మపై అయోమయం!

29-09-2025 12:00:00 AM

నేడా, రేపా.. అయోమయంలో ఆడపడుచులు

కరీంనగర్, సెప్టెంబరు 28 (విజయ క్రాంతి): తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగపై అ యోమయం నెలకొంది. ప్రభుత్వం ఈ నెల 30న సద్దుల బతుకమ్మ సెలవు ప్రకటించగా సద్దుల బతుకమ్మ 29నే అని కొందరు పండితులు ప్రకటించడంతో ఆడపడుచులు అ యోమయానికి గురవుతున్నారు. తెలంగాణ సంస్కృతిలో విశిష్ట స్థానమున్న బతుకమ్మ పండుగ విషయంలో ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది.

తొమ్మిదిరోజులపాటు రకర కాల పూలతో పూజించి ఆనందోత్సాహాల మధ్య ఆఖరి రోజున సద్దుల బతుకమ్మ జరుపుకుని నిమజ్జనం చేస్తారు. లెక్కల ప్రకారం ఈ నెల 29న సోమవారం రోజున నిమజ్జ నం చేయాలని కొందరు అర్చకులు చెబుతుండగా, 30న నిర్వహించాలని మరికొంద రు అభిప్రాయపడుతున్నారు.

ప్రభుత్వం మాత్రం మంగళవారం రోజే సద్దుల బతుక మ్మ ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చే సింది. అయితే ప్రస్తుతం నెలకొన్న భిన్నాభిప్రాయాల కారణంగా ప్రజల్లో అయోమ యం నెలకొంది. పండగ ఒకేరోజు జరపడానికి అర్చకులు, అధికారులు ఒక నిర్ణయానికి రావాలని భక్తులు కోరుకుంటున్నారు.

సద్దుల బతుకమ్మ 29న జరుకోవాలి...

పితృ అమావాస్య అయిన ఈ నెల 21న ఎంగిలిపూల చిన్న బతుకమ్మ ప్రారంభమయింది. 22న దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. 29న సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకోవాలి. 30న సువాసిని పూజ, అక్టోబర్ 1న మహానవమి, 2న విజయ దశమి జరుపుకోవాలి.

మంగళంపల్లి శ్రీనివాస శర్మ, నగర ప్రధాన వైదిక పురోహితులు

29నే సద్దుల బతుకమ్మ శ్రేష్టం

- బతుకమ్మ పండుగను ఈ నెల 29న సోమవారం జరుపుకోవడమే శ్రేష్టం. గౌరమ్మను పూజిస్తాం కనుక సోమవారం జరుపుకోవాలి. సోమవారం 9వ రోజు అవుతుంది. అలాగే విజయ దశమి అక్టోబర్ 2న జరుపుకోవాలి. అక్టోబర్ 20న నరకచతుర్దశి, 21న ధనలక్ష్మి పూజ, దీపావళి పండుగజరుపుకోవాలి.

నమిలకొండ రమణాచార్యులు, మయూరగిరి పీఠాధిపతులు