28-08-2025 11:07:35 PM
రెండవ రోజు తగ్గని వరద ఉధృతి..
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలంలో గురువారం వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. గురువారం ఉదయం సైతం వర్షం కురడంతో వాగులు యధావిధిగా ప్రవహిస్తున్నాయి. మండలంలోని సంతాయిపేట భీమేశ్వర వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. భీమేశ్వర బాబు వాగు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని తాకుతూ వేగంగా ప్రవహిస్తుండడంతో ప్రజలు భయపడుతున్నారు. ఎర్రపహాడు పెద్ద వాగు బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తుంది. ఈ వాగు దృశ్యాలను చూడడానికి ప్రజలు తరలివస్తున్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి వాగు, కాలోజివాడి వాగు, కన్కల్,నందివాడ పిల్లఒర్రె వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.
లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నివాసం ఇండ్ల లోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు రైతులు వేసుకున్న పంటల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి. దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది కనీసం పెట్టుబడులైనా వచ్చే అవకాశాలు లేకుండా పోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వర్షం అతి భారీగా పడడంతో చెరువులు కుంటలు నిండుకుండలా నిండిపోయాయి. కొన్ని చెరువులు ప్రమాద స్థితిలో ఉన్నాయి. చెరువుల పరిస్థితి ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ప్రమాద స్థితిలో ఉన్న చెరువులను కుంటలను గుర్తించి నుంచి తప్పించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.