08-07-2025 05:26:54 PM
వరంగల్/మహబూబాబాద్ (విజయక్రాంతి): కాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానం(Sri Bhadrakali Temple)లో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు పదమూడవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం 5 గంటలకు నిత్యాహ్నికం పూర్తిచేసిన పిమ్మట తిథిమండల దేవతా కార్యక్రమంలో భాగంగా అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని ‘మాత్రా’ గాను, షోడశీ క్రమాన్నీ అనుసరించి జ్ఞానశక్తిని ‘సర్వమంగళ’ గాను అలంకరించి పూజారాధనలు జరిపారు.
10న శాకాంబరి అలంకారం
శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున 3 గంటల నుండి నిత్యాహ్సికం నిర్వర్తింపబడిన అనంతరం అమ్మవారికి ఉదయం 9 గంటల వరకు శాకంభరీ అలంకారము నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. అలంకారము జరుపుచున్న సందర్భములో అమ్మవారి దర్శనం చేస్తున్నట్లు చెప్పారు. అలంకారము జరుపబడిన పిమ్మట పూజానంతరం ఉదయం 9 గంటల నుండి రాత్రి వరకు శాకాంబరి విశ్వరూప దర్శనం కల్పిస్తామని, సర్వ దర్శనమునకు భక్తులను అనుమతిస్తామని ఈవో శేషు భారతి తెలిపారు. భక్తుల సౌకర్యార్థం సర్వదర్శనంతో పాటు విశిష్ట దర్శనం, అతి శీఘ్రదర్శనం, ధర్మ దర్శనం క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గురువారం రోజున ఉదయం 11 గంటలకు వ్యాసపూజ, మహాపూర్ణాహుతి, బనిప్రధానం, అవబృథంతో శాకంభరీ ఉత్సవ పరిసమాప్తి జరుగుతుందన్నారు.
పదివేల మందితో శోభాయాత్ర
శాకంబరి వేడుకల సందర్భంగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 10 వేలమంది భక్తులు అమ్మవారికి కూరగాయలు సమర్పించుటకు వరంగల్ ఓసిటీ నుండి భద్రకాళి దేవాలయము వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, దేవాలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, మోతుకూరి మయూరి రామేశ్వర్రావు, నార్ల సుగుణ, తొగరు క్రాంతి, బింగి సతీష్, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవాలయములో భక్తులకు ఏర్పాటు చేసిన నూతన క్యూలైన్లు బారికేడింగ్ పరిశీలించిన వరంగల్ ఏ.ఎస్.పి శుభం ప్రకాష్ మట్వాడ సి.ఐ గోపి తదితరులు పరిశీలించారు.