08-07-2025 05:36:51 PM
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): సర్వే ప్రక్రియ రెవెన్యూ వ్యవస్థకు కీలకమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గనుల వృత్తి శిక్షణా కేంద్రంలో నిర్వహిస్తున్న లైసెన్స్ సర్వేయర్ల శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న సర్వేయర్లతో శిక్షణా కార్యక్రమం తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... సర్వే విషయంలో సంపూర్ణ అవగాహన అవసరమని, భూ సమస్యల పరిష్కారానికి సర్వే చాలా కీలకమని వివరించారు. సర్వేలో సరిగ్గా, శాస్త్రీయంగా సర్వే చేసి భూమి హద్దులు నిర్ణయించాల్సి ఉంటుందని, అందువల్ల శిక్షణా కార్యక్రమంలో సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. భూ కొలతలు, హద్దులు నిర్దేశించడం, భూ వివాదాలు నివారించడంలో సమగ్రమైన సర్వే కీలకమని తెలిపారు.
సర్వేలో ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహనతో శిక్షణ పొందుతూ, భవిష్యత్తులో పటిష్టమైన సర్వే నిర్వహణకు ఆధారంగా నిలవాలన్నారు. అభ్యర్థుల సామర్థ్యాన్ని మెరుగుపరచడానికీ లైసెన్స్ డ్ సర్వేయర్ శిక్షణ ఎంతో ఉపయోగపడతుందని తెలిపారు. జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం మొత్తం 162 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, మొదటి విడతలో ఎంపిక చేసిన 87 మంది అభ్యర్థులకు మే 26వ తేదీ నుంచి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణా కాలం 50 పని రోజులు ఉంటుందని, శిక్షణా కాలంలో ఉదయం తరగతులు, సాయంత్రం క్షేత్రస్థాయిలో భూమి కొలతలు శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ నెల 28, 29 తేదీలలో క్షేత్ర సందర్శన, ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటి ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్లు గంగాధర్, గణేశ్ యాదవ్, రాములు, టెక్నికల్ సిబ్బంది పరమేష్ తదితరులు పాల్గొన్నారు.