03-05-2025 12:00:00 AM
గద్వాల, మే 2 ( విజయక్రాంతి ) : భూ భారతి చట్టం అమలుకు ఈ నెల 5 నుంచి 16 వరకు ఇటిక్యాల మండలాన్ని పైలట్గా ఎంపిక చేసినందున, తహసీల్దార్లు పూర్తిగా సిద్ధంగా ఉండి ప్రజల భూ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారుశుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్ నందు భూభారతి చట్టం,రెవెన్యూ సదస్సు పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టట్ మాట్లాడుతూ భూ భారతి చట్టం అమలులో భాగంగా,జిల్లాలోని ఇటిక్యాల మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ మండలంలోని తేది:-05.05.225 న గోపాల్ దిన్నె, 06న వావిలాల, 07న పెద్ద దిన్నె, 08న సత్తర్ల, 09న ఎం.ఆర్. చెరువు, 12న షాదాబ్, 13న ఇటిక్యాల, 14న చాగాపురం, 15న మునగాల, 16న ఉదండాపురం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుండి భూ సంబంధిత దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఇటిక్యాల మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేసిన నేపథ్యంలో అక్కడ అవసరమైన సిబ్బంది,టీమ్స్,అవసరమైన పత్రాలు,రిజిస్టర్లు మొదలైనవి ముందుగానే సిద్ధం చేయాలని తహసీల్దార్లకు సూచించారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, తహసీల్దార్లు వీర భద్రప్ప,నరేష్,డిప్యూటీ తహసీల్దార్ నందిని,తదితరులు పాల్గొన్నారు.