11-05-2025 01:57:43 AM
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): సీతమ్మసాగర్ బ్యారేజీ, సీతారామసాగర్ ప్రాజెక్టు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే 97శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ప్రధా న కాలువ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలి సి మంత్రి ఉత్తమ్ అధికారులతో శనివారం జలసౌధలో సమీక్ష నిర్వహించారు. సీతమ్మసాగర్ బ్యారేజీ, సీతారామసాగర్ ప్రాజెక్టు పనుల పురోగతి విషయంలో ఏర్పడిన ప్రధాన ఆటంకాలపై సమీక్షలో చర్చించినట్లు ఉత్తమ్ తెలిపారు. అనుమతులు, భూసేకరణ, పనుల ప్రోగ్రెస్, పెండింగ్ అంశాలపై ఇంజినీర్లు పవర్‌పాయిం ట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారని మంత్రి వెల్లడించారు.
పాలేరు లింక్ కెనా ల్, సత్తుపల్లి ట్రంక్ కెనాల్, ఎన్కూరు లింక్ కెనాల్ పనులు పురోగతిలో ఉన్నాయని.. భూసేకరణను పూర్తిచేయడంతో పాటు టన్నెల్ నిర్మాణాలకు సంబంధించి త్వరగా పర్యావరణ అనుమతులు సాధిస్తామని భరోసా వ్యక్తం చేశారు. అన్ని సమస్యలను దశలవారీగా అధిగమిస్తూ ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రాజెక్టుకు తీసుకోవాల్సిన అనుమతులు లేకుండా పనులు ప్రారంభించినందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన రూ.53.41కోట్ల జరిమానాను రద్దుపర్చేందుకు చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రధాన కాలువ పెండింగ్ పనులన్నింటినీ పూర్తిచేసి యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురా వాలని, డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ త్వరగా పూర్తిచేయాలని సూచించినట్లు వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రధాన అడ్డంకిగా ఉండే భూసేకరణ సమస్యలు ఈ ప్రాజెక్టులోనూ ఉన్నాయని అందుకే వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తిచేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. భూసేకరణ వల్ల పనులు ఆలస్యం అయిన మాట వాస్తవమేనని వెల్లడించారు.
అటవీ భూములకు సంబంధించి అనుమతులు తీసుకోవడంతో పాటు రోడ్ల బ్లాక్ సమస్యపై చర్చించామని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామని ఇందుకోసం ఇంజినీర్లు, ఏజెన్సీలతో మాట్లాడామని మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నీటి కేటాయింపులు లభించలేదని తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే తమ ప్రయత్నం కారణంగా కేటాయింపులు జరిగాయన్నారు.
16నెలల తమ పాలనలో 67 టీఎంసీల నీటి కేటాయింపులు సాధ్యం చేశామన్నారు. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ సల హాదారు ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీలు అనిల్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
సమీక్షకు హాజరైన గుమ్మడి నర్సయ్య
ఇల్లందుకు సాగునీరు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యను కూడా ఈ సమీక్షకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన మేరకు ఇల్లందు మీదుగా సాగునీరు అందిస్తే జిల్లా మొత్తానికి కూడా ఉపయోగంగా ఉంటుందని నర్సయ్య మంత్రులకు తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిజైన్ మేరకు పనులు పూర్తి చేస్తూ అవసరమైన చోట లింక్ కెనాల్ ద్వారా పనులు చేపట్టవచ్చని ఇంజినీర్ల దృష్టికి తీసుకుపోయారు.