09-05-2025 02:37:06 AM
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు చేరటం లేదు. దీంతో సీట్లు పెద్దగా నిండటం లేదు. బీఎస్సీ, బీఏ, బీకామ్‌లోని అన్ని సీట్లు భర్తీకి నోచుకోవడం లేదు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీలో చేరకుండా ఇంజినీరింగ్, వైద్య, ఫార్మసీ, అగ్రికల్చర్ విద్య వైపు అడుగులు వేస్తుండటంతో డిగ్రీలో సీట్లు భర్తీకావడం లేదు. అడ్మిషన్ల ప్రక్రియ ముగిసి క్లాసులు ప్రారంభమయ్యే వరకు కూడా సగం సీట్లు భర్తీ అవ్వడంలేదు.
డిగ్రీ అడ్మిషన్లకు మూడో విడత రిజిస్ట్రేషన్‌కు జూన్ 19 వరకు గడువుంది. మళ్లీ ఆ తర్వాత కూడా స్పెషల్ ఫేజ్ కింద రెండు మూడు దఫాలుగా అడ్మిషన్లు చేపడుతారు. అయినా డిగ్రీ సీట్ల భర్తీ 50 శాతం దాటడంలేదు. డిగ్రీ కోర్సులు పూర్తి చేస్తే మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించవనే అపోహ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉంది.
ఈక్రమంలోనే భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఇంటర్‌లో అడ్మిషన్లు తీసుకున్నప్పుడే జేఈఈ, నీట్.. లేకుంటే ఎప్‌సెట్‌కు తమ పిల్లలను సన్నద్ధం చేయిస్తున్నారు. విద్యార్థులు కూడా డిగ్రీలో చేరకుండా ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో చేరేందుకే ఇష్టపడుతున్నారు. ఈనేపథ్యంలోనే డిగ్రీలో జాయిన్ అవుతున్న వారి సంఖ్య పెరగటం లేదు.
కోటా నిలుపుదలతో ఎక్కువ సీట్లు..
2025-26 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో 1,057 డిగ్రీ కాలేజీలుండగా, వాటిలో మొత్తం 4,57,724 సీట్లున్నాయి. అయితే వీటిలో 70 ప్రైవేట్ కాలేజీలు నాన్ దోస్త్‌లో ఉన్నాయి. వీటిలో 40,603 సీట్లున్నాయి. ఈసీట్లను దోస్త్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా ఆయా కాలేజీలే సొంతంగా భర్తీ చేసుకుంటున్నాయి. ఏపీకు డిగ్రీ సీట్లలో ఇంత కాలం అమలైన 15 శాతం కోటా ఇక నుంచి ఉండదు.
రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు పూర్తికావడంతో ఆ కోటాను ప్రభుత్వం నిలిపేసింది. దీంతో మొత్తం సీట్లలో 95 శాతం సీట్లు ఈ విద్యాసంవత్సరం నుంచి మన విద్యార్థులకే దక్కనున్నాయి. 5 శాతం సీట్లు తెలంగాణ స్థానికులను వివాహం చేసుకున్న వారికి, తెలంగాణలో స్థిరపడ్డ ఇతర రాష్ట్రాల వారి పిల్లలకు కేటాయిస్తారు. అంటే గతంలో కంటే ఈసారి మన విద్యార్థులకు కేటాయించే సీట్ల సంఖ్య పెరగనుంది.
మిగులుతున్న సీట్లు
2024-25 రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్, రెసిడెన్షియల్ కాలేజీల్లో 4,57,704 సీట్లు అందుబాటులో ఉంటే, వాటిలో 2.12 లక్షల సీట్లు మాత్రమే నిండాయి. ఇంటర్‌లో దాదాపు 3.90 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత అవుతున్నారు. వీరిలో 90 వేల మంది ఇంజినీరింగ్ విద్య వైపు వెళ్తున్నారు. ఇంటర్ చదివిన విద్యార్థుల్లో కొందరు జేఈఈ మెయిన్స్ ద్వారా ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్ కోర్సులకు వెళ్తుంటే, మరికొందరేమో టీజీ ఎప్‌సెట్ ద్వారా ఇంజినీరింగ్, అగ్రికల్చర్ బీఎస్సీ వంటి కోర్సులవైపు వెళ్తున్నారు.
నీట్ ద్వారా ఎంబీబీఎస్ వంటి కోర్సులనూ ఎంచుకుంటున్నారు. ఇలా యేటా 90 వేల నుంచి లక్ష మంది విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరుతున్నారు. 3.90 లక్షల మంది లక్ష వరకు పోతే మిగిలిన 2.90 లక్షల మంది విద్యార్థుల్లో డిగ్రీలో చేరుతున్నది 2 లక్షల మందే. మరో 90 వేల మంది ఇతరత్రా కోర్సుల్లో చేరడం, చదువును ఆపేయడం, వ్యాపారాలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు.
దీంతో డిగ్రీ సీట్లు నిండట్లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికితోడూ గతంలో ఇబ్బడిముబ్బడిగా డిగ్రీ కాలేజీలు, సీట్ల పెంపునకు అవకాశమివ్వడం కూడా ఇందుకు ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు. ఇలా సీట్లు భారీగా మిగిలిపోతుండటంతో రాష్ట్రంలో ఉన్నతవిద్యలో తెలంగాణ వెనుకబడిపోతున్నాదనే సంకేతాలు వెళ్తున్నాయి.