calender_icon.png 16 December, 2025 | 7:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేలానికి వేళాయె

16-12-2025 12:00:00 AM

  1. నేడు ఐపీఎల్ మినీ వేలం 
  2. విదేశీ ఆల్‌రౌండర్లపైనే ఫోకస్ 
  3. దేశవాళీ క్రికెటర్లపైనా అంచనాలు

* ఐపీఎల్ సందడి మొదలైపోయింది. కొత్త సీజన్‌కు ఇంకా 3 నెలల టైమున్నా ఆటగాళ్ల వేలంతో ఫీవర్ కనిపిస్తోంది. ఈ సారి జరబోయేది మినీ వేలమే అయినప్పటకీ కోట్లాభిషేకం ఎవరిపై కురుస్తుందో అన్న ఆసక్తి క్రికెట్ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. విదేశీ స్టార్ ప్లేయర్స్‌లో  కామెరూన్ గ్రీన్, లివింగ్‌స్టోన్ , కాన్వే, మిల్లర్, పతిరణ, హసరంగ, డారిల్ మిఛెల్ వంటివారికి భారీ ధర పలికే అవకాశముంది. అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న అన్‌క్యాప్డ్ ప్లేయర్స్‌పైనా కాసుల వర్షం కురిసే ఛాన్సుంది.

అబుదాబీ, డిసెంబర్ 15: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తారో ఆటగాళ్ల వేలానికి సైతం అంతే ఆసక్తి కనబరుస్తుంటారు. ఎందుకంటే ఏ ప్లేయర్‌కు జాక్‌పాట్ తగులుతుందో, ఎవరు ఎంత భారీ ధరకు అమ్ముడవుతారో, ఎవరు అన్‌సోల్డ్‌గా మిగిలిపోతారో వంటి అంశాలు ఉత్కంఠ రేకెత్తిస్తుంటాయి. ఐపీఎల్ 2026 సీజన్ కోసం మినీ వేలానికి అంతా సిద్ధమైంది. అబుదాబీ వేదికగా మంగళవారం మినీ ఆక్షన్ జరగబోతోంది.

ఇప్పటికే ఫ్రాంచైజీలు చాలా మంది ప్లేయర్స్‌ను వేలంలోకి రిలీజ్ చేసి, తమ కాంబినేషన్‌కు తగ్గట్టుగా కీలక ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి.ఇప్పుడు టీమ్‌లో మిగిలిపోయిన ఖాళీలను భర్తీ చేసుకునేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 1355 మంది ప్లేయర్స్ తమ పేర్లు రిజిస్టర్ చేసుకోగా, ఫ్రాంచైజీలతో చర్చించిన తర్వాత 359 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. వీరిలో భారత్ నుంచి 244 మంది, విదేశీ ప్లేయర్స్ 115 మంది ఉన్నారు.

ఈ జాబితాలో 112 మంది క్యాప్డ్ ప్లేయర్స్(జాతీయ జట్టుకు ఆడినవారు), 238 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్స్(జాతీయ జట్టుకు ఆడనివారు) ఉన్నారు. 10 ఫ్రాంచైజీలలో కలిపి 77 ఖాళీలే ఉండగా.. రూ.237.55 కోట్లు ఖర్చు చేయొచ్చు. వేలానికి ముందు అన్ని జట్లు తమ ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకున్నాయి. అయితే మినీ వేలంలో కూడా పలువురు స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. కామెరూన్ గ్రీన్, వెంకటేశ్ అయ్యర్, రవి బిష్ణోయ్, డేవిడ్ మిల్లర్, మహేశ్ తీక్షణ, పతిరణ, కాన్వే వంటి ప్లేయర్స్ భారీ ధర పలికే అవకాశముంది.

వీరిలో కొందరిని గతంలో భారీ ధరకు కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలు ఇప్పుడు వేలంలోకి వదిలేసి తక్కువ ధరకు దక్కించుకోవాలని కూడా చూస్తున్నాయి. మినీ లేలంలో రూ.2 కోట్లు , రూ.1.5 కోట్లు, రూ.1.25 కోట్లు, రూ. కోటి, రూ.75 లక్షలు, రూ.50 లక్షలు, రూ.40 లక్షలతో పాటు రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో ఆటగాళ్లు ఉన్నారు. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ జాబితాలో 40 మంది ప్లేయర్స్ ఉండగా.. రూ.1.5 కోట్ల బేస్ ప్రైస్‌తో 9 మంది వేలంలో నిలిచారు.

రూ.1.25 కోట్ల కనీస ధరతో నలుగురు, కోటి రూపాయల బేస్ ప్రైస్‌తో 17 మంది వేలంలో ఉన్నారు. ఫ్రాంచైజీల మనీపర్స్ విషయానికొస్తే మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ అత్యధికంగా రూ. 64.3 కోట్లతో వేలానికి సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.43.4 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.25.5 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ రూ.22.95 కోట్లతో ఉండగా.. అత్యల్పంగా ముంబై ఇండియన్స్ కేవలం రూ.2.75కోట్లతో వేలం బరిలో ఉంది.

ప్రతీ జట్టులో కనీసం 18 మంది, గరిష్టంగా 25 మంది ప్లేయర్స్ ఉండొచ్చు. వీరిలో విదేశీ ఆటగాళ్లు 8 మంది వరకూ ఉండొచ్చు. మినీ వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 13, సన్ రైజర్స్‌కు 10, చెన్నై , రాజస్థాన్ జట్లలో 9, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీలకు 8, గుజరాత్‌కు 5, పంజాబ్ జట్టులో 4 , ముంబై ఇండియన్స్ జట్టులో 5 ఖాళీలున్నాయి.మినీ వేలం కావడంతో మర్కీ ప్లేయర్స్ సెట్ ఉండదు. వేలం క్యాప్డ్ బ్యాటర్స్‌తో మొదలవుతుంది.

ఈ సెట్‌లో కామెరూన్ గ్రీన్, ఫ్రేజర్ మెక్‌గర్క్, సర్ఫరాజ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, పృథ్వీ షా ఉన్నారు. తొలి రౌండ్లలో అమ్ముడుపోని ప్లేయర్స్‌ను ఫ్రాంచైజీలు కోరితే చివర్లో యాక్సిలిరేటెడ్ సెట్‌లో మరోసారి వేలం వేస్తారు. ఇదిలా ఉంటే  ఈ సారి మాక్స్‌వెల్, డుప్లెసిస్, మొయిన్ అలీ వంటి పలువురు టీ ట్వంటీ స్టార్స్ వేలం నుంచి తప్పుకున్నారు. కాగా ఈ సారి మినీ వేలంలో కొత్తగా టై బ్రేకర్ రూల్ తీసుకొచ్చారు.

దీని ప్రకారం రెండు ఫాంచైజీలు ఒకే ప్లేయర్ కోసం వేసి బిడ్లు సమంగా ఉన్నప్పుడు టై బ్రేకర్ రూల్ ద్వారా ఆ ఫ్రాంచైజీలకు ఫామ్ ఇస్తారు. దీనిలో ఆ ఫ్రాంచైజీ తమ చివరి బిడ్‌ను సీక్రేట్‌గా రాయాల్సి ఉంటుంది. అయితే ఆటగాడికి రహస్య బిడ్ దక్కదు. అంతకుముందు ఏ బిడ్‌పై అయితే వేలం నిలిచిపోయిందో ఆ మొత్తమే ఆటగాడికి లభిస్తుంది. సీక్రేట్ బిడ్ మొత్తం మాత్రం బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది.