calender_icon.png 13 July, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మికుంట టు ఎనుమాముల

08-02-2025 01:32:10 AM

* పత్తి రైతులను దగా చేస్తున్న దళారులు

కరీంనగర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో అతి పెద్ద మార్కెట్ అయిన జమ్మికుంట, వరంగల్ జిల్లాలో పెద్ద మార్కెట్ అయిన ఎనుమాములలో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)లోని కొందరు దళారులకు సహకరిస్తుండడంతో పత్తి రైతులు నష్టపోతున్నారు.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్లో సీసీఐ ఇప్పటి వరకు 2 లక్షల 39 వేల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, మిల్లర్లు, దళారులు 2 లక్షల 9 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. దళారులు కొన్న పత్తిని తిరిగి సీసీఐ వారే కొనుగోలు చేస్తుంటారు. తేమ, క్వాలిటీల పేరుతో మద్దతు ధర కంటే తక్కువకు కొను గోలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో పత్తి రైతులు ఎక్కు వగా జమ్మికుంట, ఎనుమాముల మార్కెట్ కు వెళ్తుంటారు. ఇది ఆసరా చేసుకొని పత్తి రైతులను దగా చేస్తున్నారు. కంప్యూటర్ ఆప రేటర్ల నుంచి సిబ్బంది వరకు ఒక ముఠాగా ఏర్పడి క్వింటాలుకు 100 నుంచి 200 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.

సీసీఐ అధికారులకు తెలిసినా కమీషన్ వెళ్తుండడంతో చూసీచూడనట్లు వ్యవహరి స్తున్నారు. అధికారుల నుండి మార్కెట్ పాలకవర్గాల వరకు వాటాలు వెళ్తుండడం తో ఈ వ్యవహారం బయటకు పొక్కడం లేదు. వరంగల్ జిల్లాలో మీనాక్షి జిన్నింగ్ మిల్లుకు సంబంధించిన ఆపరేటర్ చేతివా టం బహిర్గతమైనా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు.

మరో నెలరోజులపాటు పత్తి మార్కెట్ కు రానుండడంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జమ్మి కుంట, ఎనుమాములలో కాటన్ అసోసియే షన్ నాయకులు డబ్బులను వసూలు చేసి పంపకాలు సాగిస్తున్నారు. తేమ, క్వాలిటీ పేరుతో మొదట రిజక్ట్ చేసి ఆ తర్వాత రేటును నిర్ణయిస్తున్నారు.

టీఆర్ చేయకుం డా కొర్రీలు పెట్టి మొదట వెనక్కు పంపి ఆ తర్వాత క్వింటాలుకు 12 రూపాయలు అధికారులు పేరుతో, డీఐలకు 3 రూపాయ లు, మిల్లు యజమానుల నుండి 15 రూపాయలు వసూలు చేస్తూ పంపకాలు కొనసాగిస్తున్నారు. జమ్మికుంట, ఎనుమా ముల మార్కెట్లకు దూరప్రాంతాల నుంచి వచ్చిన లోడ్లను వాహనాల సైజునుబట్టి 2 వేల నుంచి 5 వేల వరకు వసూలు చేస్తున్నారు.

గత సంవత్సరం ఇదే సీజన్లో మద్దతు ధర కంటే ఎక్కువ రేటు పలకగా, ఈ సీజన్లో పత్తి ధర పెరగకపోగా ఉన్న ధరను కూడా రైతులకు అందకుండా చేస్తున్నారు. సీజన్ ముగుస్తున్న సమయంలో కూడా ఈ వసూ ళ్ల పరంపర కొనసాగుతుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు.