22-08-2025 12:00:00 AM
నిర్మల్, ఆగస్టు ౨౧ (విజయక్రాంతి): రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు. గురువారం నిర్మల్ రూరల్ మండలం చిట్యాలలోని అభయ కృషి ఎరువులు, విత్తనాల దుకాణాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎరువుల కొరత లేదని, యూరియా, డీఏపీ సహా అవసరమైన ఎరువులు సరిపడా స్టాక్లో ఉన్నాయని వెల్లడించారు.
రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు మాత్రమే ఎరువులను వినియోగించాలని సూచించారు. ప్రతి షాపులో ఎరువుల రేటు చార్ట్ తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. ఎరువుల సరఫరాలో ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలని అధికారులకు సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.