calender_icon.png 28 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 46ను రద్దు చేయాలి

28-11-2025 12:00:00 AM

  1. 42 శాతం రిజర్వేషన్‌తోనే ఎన్నికలకు వెళ్లాలి

బీసీ జేఏసీ చైర్మన్,ఎంపీ ఆర్ కృష్ణయ్య 

లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద 

వందలాది మందితో నిరసన 

ముషీరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్‌లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి, బీసీలకు దోకా చేసిందని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య విమర్శించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా 46 జీవోను తీసుకువచ్చి బీసీలను నట్టేట ముంచిందని, తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకొని, 42 శాతం రిజర్వేషన్‌తోనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

బీసీలకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 17 శాతానికి తగ్గించడం అన్యాయమని, దీనిని నిరసిస్తూ తెలంగాణ బీసీ జాక్ ఆధ్వర్యంలో గురువారం నిజాం కాలేజి నుంచి లోయర్ ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్ విగ్రహం వరకు వందలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనకు రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ మోడీ రాందేవ్, రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు అంజి నాయకత్వం వహించారు.

అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థ రిజర్వేషన్లు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డిలో డెక్లరేషన్ చేసి, ఎన్నికల తర్వాత అసెంబ్లీలో చట్టం చేశారని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా జీవో 9 జారీ చేశారని అన్నారు. బీహార్ ఎన్నికలు ముగియగానే రిజర్వేషన్లను 17 శాతం తగ్గించి తీవ్ర అవక-తవకలు పాల్పడ్డారన్నారు. జీవో 46 కారణంగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల కేటాయింపులో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. పలు జిల్లాల్లో, అనేక మండలాల్లో, గ్రామా ల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ లేదా వార్డు సభ్యుని సీటు కూడా కేటాయించలేదని దాదాపు 1200 సర్పంచ్ పదవులు దక్కకుండా పోయాయన్నారు.

మొదటి నుంచి బీసీ రిజర్వేషన్లు కల్పించే విషయంలో కాం గ్రెస్ తీరు-తెన్నులు అనుమాదాస్పదంగా ఉన్నాయన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత అఖిలపక్షాన్ని ప్రధానమంత్రిని కలవడానికి ఎందుకు తీసుకుకెళ్లలేదని ప్రశ్నిం చారు. లోక్ సభలో ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారని,  గత పార్లమెంటు సమావేశాలు బీహార్ ఓటర్ల విష యంలో నెల రోజులు పార్లమెంట్ బహిష్కరించారు కానీ బీసీల విషయంలో ఒక్కరోజు కూడా ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. రిజర్వేషన్ల కేసు హైకోర్ట్‌లో నడుస్తు న్నదని, తీర్పు రాకముందే ఎన్నికలకు ఎలా వెళతారు అని ప్రశ్నించారు.

చిత్తశుద్ధి ఉంటే ప్రైవేటు బిల్లు ఎందుకు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ అంటే మోసం అనేది ప్రజలకు తెలిసిపోయిందన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక రెండేళ్లు డ్రామా నడిపి, ఇప్పుడు ఇవ్వలేమని చేతులు ఎత్తివేయడం దుర్మార్గమని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జాతీ య బీసీ సంక్షేమ సంఘం కో  ఆర్డినేటర్ ర్యాగ అరుణ్ కుమార్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య, రాష్ట్ర సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు భూమన్న యాదవ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు జి. అనంతయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  పగిళ్ళ సతీష్ కుమార్, అంజి గౌడ్, నిఖిల్, బాలస్వామి, వంశీ తదితరులు పాల్గొన్నారు.