09-05-2025 08:28:23 PM
రామగుండంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
రామగుండం,(విజయక్రాంతి): నిర్దిష్ట అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తో కలిసి విస్తృతంగా పర్యటించారు. రైల్వే స్టేషన్ ఎదురుగా వీధి వ్యాపారుల కోసం నిర్మిస్తున్న భవనం, పికే రామయ్య కాలనీలోని రోడ్డు నిర్మాణ పనులు, రాజీవ్ రహదారి వద్ద డ్రైనేజీ పనులు, సి.ఎస్.ఆర్ క్లబ్ వద్ద అగ్నివీర్ శిక్షణ కేంద్రం, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీధీ వ్యాపారుల కోసం నూతనంగా రైల్వే స్టేషన్ ఎదురుగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు పరిశీలించి, స్థానికులకు ఇక్కడ అవకాశం కల్పించాలని, దీనిని పూర్తి చేసేందుకు అవసరమైన మరో రూ.30 లక్షలు మంజూరు చేస్తూ రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. టి.యు.ఎఫ్.ఐ.డి.సి నిధుల ద్వారా పి.కే రామయ్య కాలనీలో నిర్మించిన రొడ్డు నిర్మాణ పనులు, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మిస్తున్న హెచ్.కే.ఆర్. డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలించి, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.
అగ్నివీర్ యువ శక్తికి మంచి విద్య, శిక్షణ
సి.ఎస్.ఆర్. క్లబ్ జవహర్ నగర్ స్టేడియం పక్కన 126 మంది అభ్యర్థులకు ఉచితంగా అందిస్తున్న శిక్షణ కేంద్రం అగ్నివీర్ యువ శక్తిని పరిశీలించి అభ్యర్థులకు నాణ్యమైన భోజనం, విద్య, మంచి శిక్షణ అందేలా చూడాలని అన్నారు.
ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రంలోనే ముందు వరుసలో రామగుండం
రామగుండం పురపాలక కార్యాలయంలో నగర పారిశుధ్యం, అభివృద్ధి, పన్ను వసూలు వంటి పలు అంశాల పై రివ్యూ చేశారు. ఎర్లీ బర్డ్ స్కీం కింద ఆస్తి పన్ను వసూలు రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిచిన రామగుండం నగరపాలక సంస్థ అధికారులను కలెక్టర్ అభినందించారు.
నిర్ణీత సమయంలో ఆసుపత్రి పనులు పూర్తి చేయాలి
రామగుండం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి నిర్ణీత సమయంలో పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ భూమిని శుభ్రం చేయండి
రామగుండం హెడ్ క్వార్టర్ లోని పెద్ద చెరువు పక్కన ఉన్న 16 ఎకరాల ప్రభుత్వ భూమిని శుభ్రం చేసి మట్టితో నింపాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఇంచార్జి ఆర్.డి.ఓ.సురేష్, ఈ రామన్, తహసిల్దార్ ఈశ్వర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.