05-11-2025 04:41:59 PM
హైదరాబాద్: రాబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అసెంబ్లీ ఉపఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్స్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎంఎల్ఏలు లక్ష్మీకాంత రావు, గణేష్, మాజీ ఎంఎల్ఏ సంపత్ కుమార్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్,ఏఐసీసీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు అనిల్ థామస్ హాజరయ్యారు. పాస్టర్స్ తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో సానుకూలంగా స్పందించారు. జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం పనిచేస్తామని పాస్టర్స్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... భారత్ జోడో పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశంలోని మైనార్టీలకు ఒక భరోసా ఇచ్చారని, బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఎనిమిది చోట్ల డిపాజిట్ రాలేదని, దీంతో ఆ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసిందని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరమని, కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్లే అని సూచించారు.
జూబ్లీహిల్స్ లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోందని, కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్న బీజేపీ ఇప్పటి వరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఒప్పందం లేకపోతే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు..? రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ చేశారని విరుచుకుపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును మాత్రం విచారణ కు పిలవడం లేదని, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉందని గతంలో కవితనే ఈ విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసేందుకు జూబ్లీహిల్స్ ను ప్రయోగశాలగా చూస్తున్నారని, కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క దళితుడే మంత్రిగా ఉన్నాడని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి వర్గంలో నలుగురు దళితులకు మంత్రులుగా అవకాశం కల్పించామని, అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ కి అవకాశం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. అత్యంత నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానమని, జూబ్లీహిల్స్ లో మోదీ, కేసీఆర్ ఒక వైపు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మరో వైపు నిలబడ్డారని ముఖ్యమంత్రి వివరించారు.