05-11-2025 06:06:21 PM
ఆళ్ళపల్లి (విజయక్రాంతి): బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల పరిధిలోని వివిధ గ్రామాలలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా భక్తులంతా తెల్లవారుజామున గ్రామ సమీపంలోని కిన్నెరసాని చేరుకొని నది స్నానాలు ఆచరించి అరటి మట్టలతో కార్తీకదీపాలు వెలిగించి వాగులో వదిలారు. అనంతరం సమీపంలోని ఆలయాలకు చేరుకొని 365 వత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హైందవులకు కార్తీక మాసం ప్రత్యేకమైనది కావడంతో ఈ మాసం మొత్తం ఎంతో నిష్టగా పూజా కార్యక్రమాల ఈ మేరకు మండల కేంద్రంలోని రామాలయం, ఎల్లమ్మ ఆలయం, మర్కోడులోని రామాలయం, దుర్గమ్మ ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒక్క పొద్దులతో సమీపంలోని పుట్ట వద్దకు చేరుకొని నాగదేవతకు పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అలాగే ఉత్సవ కమిటీతో పాటు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.