calender_icon.png 19 November, 2025 | 4:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుబాటులోకి తీర్పుల వెబ్‌సైట్

16-08-2024 01:03:22 AM

ప్రారంభించిన హైకోర్టు సీజే

క్రిమినల్ కేసుల్లో సమన్ల జారీకి త్వరలో యాప్

లాయర్ల రక్షణ చట్టానికి ప్రతిపాదన

హైదరాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): హైకోర్టు వెలువరించే తీర్పులు ఇంగ్లీషు, తెలుగులో ఉండే విధంగా నూతన వెబ్‌సైట్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే గురువారం ప్రారంభించారు. దీని ద్వారా న్యాయవాదులు, కక్షిదారులకు తీర్పులు వెంటవెంటనే తెలుస్తాయన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రతిపాదన చేసిందన్నారు. క్రిమినల్ కేసుల్లో కోర్టులు జారీ చేసిన సమన్లను నిందితులకు వెంటనే అందజేసేందుకు వీలుగా త్వరలోగానే ఒక ప్రత్యేక యాప్ తీసుకొస్తామని ప్రకటించారు.

పలు కేసుల్లో నిందితులకు సమన్లు జారీకి అవుతున్న జాప్యాన్ని నివారించేందుకు వీలుంటుందని చెప్పారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం హైకోర్టు ప్రధాన భవనం పై జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత  ఈ విషయాలను సీజే ప్రకటించారు. త్వరలోనే లాయర్ల రక్షణ చట్టం రాష్ట్రం రూపొంది స్తుందనే ఆశాభావాన్ని ఆయన వెలిబుచ్చారు. ఈ చట్టం వస్తే న్యాయవాదులపై దాడులకు పాల్పడే ఆలోచన చేసే వాళ్లలో భయం ఉండాలంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహా రెడ్డి చేసిన సూచనలకు అనుగుణంగా రాష్ట్రానికి హైకోర్టు ప్రతిపాదన చేసిందని వివరించారు. 

ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర

దేశ స్వాతంత్య్ర పోరాటంలో న్యాయవాదుల పాత్ర ఎన్నటికీ మరువలేనిదని, ఇప్పటికీ రాజ్యాంగ రక్షణకు న్యాయవాదులు కృషి చేస్తున్నారని కొనియడారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు న్యాయవాదుల కృషి ఎంతగానో ఉందన్నారు. ప్రాథమిక, సామాజిక, రాజ్యాం గ హక్కుల రక్షణకు కోర్టులు వెలువరిస్తున్న తీర్పులు ప్రజలకు ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. అందరికీ న్యాయం అందించడమే కోర్టుల ప్రధాన ధ్యేయమన్నారు. కంప్యూటరీకరణ జరుగుతోందని, రెండు ధర్మాసనాలైతే పేపర్లు లేకుండా కోర్టు విధులను నిర్వహిస్తున్నాయని చెప్పారు.

జిల్లా కోర్టుల్లో రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను హనుమకొండ, నల్లగొండ జిల్లాల్లో చేపట్టామని, ఇతర జిల్లాల్లో కూడా దశల వారీగా చేస్తామన్నారు. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ప్రసంగించా రు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహా  శర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ప్రవీణ్‌కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర రావు, రెరా అప్పీలెట్ ట్రైబ్యునల్ చైర్మన్ జస్టిస్ రాజశేఖర్రెడ్డి, రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

27 ఏండ్లుగా అవార్డులు

చదువుల్లో ప్రతిభ చూపిన హైకోర్టు ఉద్యోగుల పిల్లలకు హైకోర్టు మాజీ ఉద్యోగి సీ విరూపాక్షరెడ్డి గత 27 ఏండ్లుగా ఇస్తున్న అవార్డులను ఆయన రిటైర్ అయ్యాక కూడా ఈ ఏడాది ఇచ్చారు. టెన్త్, ఇంటర్మీడియట్ ప్రతిభ కనబరచిన దాన్యి, ఆయోగ్, ఎన్ రితిక, ఐశ్వర్యా ప్రవళిక, నిమ్మ శ్రావ్యారెడ్డి, నిత్తూలూరి చరిష్మా, రేషు, హరిత్‌కుమార్, మేఘన, లావణ్య మొత్తం 9 మందికి అవార్డులను చీఫ్ జస్టిస్ పంపిణీ చేశారు. విరూపాక్షరెడ్డిని సీజే అభినందించారు.