18-07-2025 12:00:00 AM
- ఆ ముగ్గురి అక్రమాస్తులు వెయ్యి కోట్ల పైనే
- ఏసీబీ సోదాల్లో కళ్లుచెదిరే నిజాలు
- రంగంలోకి దిగిన ఈడీ
- నిధుల దారి మళ్లింపుపై లోతైన దర్యాప్తు
హైదరాబాద్,సిటీబ్యూరో జూలై 17 (విజయక్రాంతి): లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఇప్పుడు వేల కోట్ల అవినీతికి కేంద్ర బిందువుగా మారుతోంది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన ముగ్గురు ఉన్నతస్థాయి ఇంజినీర్ల ఇళ్లపై ఏసీబీ జరిపిన సోదాల్లో బయటపడిన అక్రమాస్తుల చిట్టా చూసి అధికారులు సైతం విస్తుపోతున్నారు.
ప్రస్తుత ఇంజినీర్- ఇన్ -చీఫ్, ఈఎన్‌సీలు, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఈఈ, కూడబెట్టిన ఆస్తుల మార్కెట్ విలువ రూ.1000 కోట్లకు పైమాటేనని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఏసీబీ సోదాల్లో ఈ ముగ్గురు ఇంజినీర్లకు హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లో ఉన్న లగ్జరీ విల్లాలు, ఫ్లాట్లు, వాణిజ్య సముదాయాలు, ఎకరాల కొద్దీ భూముల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇది కేవలం మంచుకొండ కొన మాత్రమేనని, లోతుగా దర్యాప్తు చేస్తే ఇంకెన్ని తిమింగలాలు బయటపడతాయోనని రాష్ర్టవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
రంగంలోకి ఈడీ
ఈ కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగి, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తును ప్రారంభించింది.ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను ఆధారం గా చేసుకుని ఈడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. విశ్రాంత ఈఎన్‌సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ నాయక్, ఈఈ నూనె శ్రీధర్‌పై నమోదైన కేసుల పూర్తి వివరాలు, రిమాండ్ రిపోర్టులు, కస్టడీ విచారణ నివేదికలను తమకు అందించాలని కోరుతూ ఏసీబీకి అధికారికంగా లేఖ రాశారు.
ప్రాజెక్టు నిధులను బినామీ కంపెనీలకు తరలించి, అక్కడి నుంచి వ్యక్తిగత విలాసాలకు, ఆస్తుల కొనుగోలుకు ఎలా మళ్లించారనే అంశంపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. ఈఈ నూనె శ్రీధర్ తన కుమారుడి వివాహాన్ని థాయ్‌లాండ్‌లో రూ. కోట్లు ఖర్చు చేసి అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ వేడుకకు అయిన ఖర్చుల మూలాలపై ఈడీ ఆరా తీస్తోంది. ఈఎన్‌సీ మురళీధర్ రావు కుమారుడు అభిషేక్ రావు పేరిట ఉన్న కంపెనీలు కాళేశ్వరం ప్రాజెక్టులో కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఈ కంపెనీల ద్వారా జరిగిన ఆర్థిక లావాదేవీలను ఈడీ క్షుణ్ణంగా పరిశీలించనుంది.
కుంగిన బ్యారేజీతో మొదలైన కథ
గతేడాది మేడిగడ్డ బ్యారేజీ వద్ద పియర్‌లు కుంగిపోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత, నిర్మాణంలో జరిగిన అవకతవకలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తా యి. దీనిపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ, ఆ తర్వాత జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికలు ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో భారీ లోపాలున్నాయని తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అవినీతి కోణంలో దర్యాప్తును ముమ్మరం చేయగా, ఇప్పుడు ఇంజినీర్ల అక్రమాస్తుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది.
మురళీధర్‌రావుకు 14 రోజుల రిమాండ్
మంగళవారం అరెస్ట్ అయిన విశ్రాంత ఈఎన్‌సీ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు న్యాయమూర్తి నివాసంలో హాజరుప రచగా, ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అనంతరం ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత లోతుగా విచారించేందుకు ముగ్గురు ఇంజినీర్లను కస్టడీకి కోరాలని ఏసీబీ, ఈడీ అధికారులు యోచిస్తున్నారు. వీరి విచారణలో మరిన్ని కీలక విషయాలు, ఉన్నతస్థాయి అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
లంచం తీసుకుంటూ దొరికిన పీఆర్ ఇంజినీర్ -ఇన్ -చీఫ్..
మరోవైపు, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వీరవల్లి కనకరత్నం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం అధికార వర్గాల్లో కలకలం రేపింది. తాండూరు నుంచి వికారాబాద్‌కు బదిలీ కోసం డీఈ నుంచి ఆయన లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకు న్నారు. మార్చిలో పదవీ విరమణ చేయాల్సిన కనకరత్నానికి ప్రభుత్వం మరో ఏడాది పదవీకాలం పొడిగించడం గమనార్హం.
హరిరామ్ నాయక్ ఈఎన్‌సీ.. అక్రమాస్తులు
విల్లాలు/ఫ్లాట్లు.. షేక్‌పేట, కొండాపూర్‌లలో లగ్జరీ విల్లా లు.. నార్సింగి, మాదాపూర్, శ్రీనగర్‌లో మూడు ఫ్లాట్లు.. శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇళ్లు. భూములు.. మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి.. పటాన్‌చెరులో 30 గుంటలు.. బొమ్మల రామారంలో 6 ఎకరాల ఫాంహౌస్. అమరావతిలో వాణిజ్య స్థలం, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం, బీఎండబ్ల్యూ కారు, బ్యాంకు లాకర్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారు ఆభరణాలు.
నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈఈ.. అక్రమాస్తులు
భవనాలు/విల్లాలు.. మలక్‌పేట లో 4 అంతస్తుల భవనం, తెల్లాపూర్‌లో లగ్జరీ విల్లా, వరంగల్‌లో జీ3 భవనం. ప్లాట్లు/స్థలాలు.. షేక్‌పేట గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో 19 ఇంటి స్థలాలు. 16 ఎకరాల వ్యవసాయ భూమి, కరీంనగర్‌లో హోటల్, అమీర్‌పేటలో వాణిజ్య సముదాయంలో ఆస్తులు, లాకర్లలో కోట్ల విలువైన ఆభరణాలు, ఇతర ఆస్తుల పత్రాలు.
మురళీధర్ రావు విశ్రాంత ఈఎన్‌సీ.. అక్రమాస్తులు:
విల్లాలు/ఫ్లాట్లు, కొండాపూర్‌లో విల్లా, బంజారాహిల్స్, యూసుఫ్ గూడ, కోకాపేట, బేగంపేటలలో 4 ఫ్లాట్లు. భూములు/ప్లాట్లు.. మోకిలలో 6,500 గజాల భారీ ప్లాటు, 11 ఎకరాల వ్యవసాయ భూమి.. హైదరాబాద్‌లో 4 ఇంటి స్థలాలు. కరీంనగర్, హైదరాబాద్‌లలో వాణిజ్య సముదాయాలు, జహీరాబాద్‌లో 2కేవీ సౌర విద్యుత్ కేంద్రం, మెర్సిడెజ్ బెంజ్ సహా 3 కార్లు, ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది.