22-07-2025 01:00:31 AM
ఏసీబీ దాడులతో నీటిపారుదల శాఖలో భయం.. భయం
ముగ్గురు ఇంజినీర్ల వద్ద దొరికిందే వేయి కోట్ల అక్రమార్జన
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): ఒకటి.. రెండు.. మూడు.. ముగ్గురూ ముఖ్యమైన పాత్ర పోషించినవారే.. ఈ ముగ్గురి దగ్గరే సుమారు రూ. వేయి కోట్ల విలువైన అక్రమ ఆస్తిపాస్తులు బయటపడ్డాయి. మ నం కూడా ఆ జాబితాలో చేరకూడదంటే.. సర్దుకుపోవడం మినహా మరోదారి లేదం టూ నీటిపారుదల శాఖలోని ఇంజినీర్లు సర్దుబాటు చర్యలకు దిగుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర పో షించిన ఈఎన్‌సీలు మురళీధర్, హరిరాం, ఈఈ శ్రీధర్‌లపై అనినీతి నిరోధక శాఖ దా డులు చేసి భారీగా అక్రమాస్తులను బయటపెట్టడం తో కాళేశ్వరం అవినీతిలో భాగస్వాములైన మిగతా ఇంజినీర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్లు భారీగా అక్రమార్జనకు దిగారనేది ము గ్గురు ఇంజనీర్లపై ఏసీబీ అధికారులు చేసిన దాడులతో స్పష్టమయ్యింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికలో పేరొ ్కన్న జాబితాలో ఉన్న ఇంజినీర్లలో గుబులు మొదలయ్యింది. తరువాత దాడులు ఎవరిపైన అనే భయం పట్టుకుంది. ఈ నేప థ్యం లో నివేదికలో ఉన్న ఇంజినీర్లందరూ తరచు గా కలుసుకుంటూ ఏం చేద్దామనే ఆలో చన చేస్తున్నట్టు సమాచారం.
కొద్దిరోజుల క్రితం పలువురు ఇంజినీర్లు సమావేశమై ఏసీబీ దాడులపై చర్చించుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా కొందరు ఇంజినీర్లు.. గత ప్రభు త్వం చెప్పినట్టుగానే చేశాం.. ఈ ప్రభుత్వం చెప్పినట్టుగానే చేస్తున్నాం.. అయినా మనపై దాడులు తప్పడం లేదంటూ వాపోయినట్టు తెలుస్తుంది. దీనికి ఇతర ఇంజినీర్లుకూడా మద్దతుగా నిలిచినట్టు సమాచారం.
ఆస్తుల సర్దుబాటులో తలమునకలు
విజిలెన్స్ కమిషన్ నివేదికలో పేర్కొన్న జాబితాలోని ఇంజినీర్లపై ఏసీబీ దృష్టి పెట్టిం ది. ఈ నేపథ్యంలో మొదటి దాడి రిటైర్డ్ ఈ ఎన్‌సీ మురళీధర్‌పై జరిగింది. ఇందులో కం డ్లు తిరిగేలా ఆస్తులు బయటపడ్డాయి. ఇక అంతకుముందు ఈఎన్‌సీ హరిరాం, ఈఈ శ్రీధర్‌లపై ఏసీబీ చేసిన దాడుల్లోనూ భారీ గా ఆక్రమాస్తులను కనుగొన్నారు. వీరిద్దరూ కూడా కాళేశ్వరం కహానీలో పాత్రధారులే.
వరుసగా కాళేశ్వరం నిర్మాణంలో పాత్రధారులైన ఇంజినీర్లపై ఏసీబీ నజర్ పెట్టిదాడు లకు దిగుతుండటంతో.. విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదికలోని జాబితాలోని ఇతర ఇం.ఇనీర్లలో గుబులు పట్టుకుంది. అందుకే ఏసీబీ దాడులు చేసినా దొరకవద్దనే ఆలోచనతో ఆస్తులను బినామీల పేర్లపైకి బదలా యించడం, దూరపు బంధువుల పేర్లపైకి మార్చడం లాంటి సర్దుబాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
అయితే కొందరు ఇంజినీర్లు మొదటి నుంచే బినామీల పేర్లపై ఆస్తులను కొనుగోలు చేశారని చర్చ కూడా జరుగుతోంది. దీనితో తమకు అంతగా ముప్పు లేదనే విధంగా వారు వ్యవహరిస్తుండటంపైకూడా ఇంజినీర్లు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది.
అందరం ఒకే మాటపై
ఇదిలా ఉండగా ప్రభుత్వం పట్టుబట్టి కాళేశ్వరం అవినీతి, అక్రమాలు, అవకతవకల్లో భాగస్వాములైన ఇంజినీర్లందరిపై ఏసీబీ దాడులతో అక్రమాస్తులను బయటపెట్టడానికి కంకణం కట్టుకోవడంతో ఇకపై అందరూ ఒకేమాటపై ఉండాలనే కట్టుబాటుకు పలువురు ఇంజినీర్లు ప్రయత్నిస్తు న్నట్టు తెలుస్తుంది.
అవినీతిలో అందరూ భాగస్వాములే.. కష్టాలు వచ్చినప్పుడు ఒకే మాటపై ఉంటే కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో అందరూ తలోమాట మాట్లాడితే మనకే నష్టం.. కనుక అందరికీ ఉపయోగపడేలా గత ప్రభుత్వం చెప్పినట్టే చేశామనే కోణంలో ఒకే మాటపై ఉందాం అని అందరినీ కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారని సమాచారం.
రూ. 5 వేల కోట్లకుపైగా అవినీతి ఆస్తులు?
ముగ్గురు ముఖ్యమైన ఇంజినీర్లపై ఏసీబీ అధికారులు చేసిన దాడుల్లో సుమారు రూ. వేయి కోట్లకుపైగా అక్రమాస్తులను గుర్తించినట్టుగా అనధికార సమాచారం వస్తోంది. ఈ లెక్కన విజిలెన్స్ కమిషన్ నివేదికలో పేర్కొన్న మిగతా దాదాపు 30 మందికిపైగా ఉన్న ఇంజినీర్ల ఆస్తులపై కూడా దాడులు చేస్తే ఈ మొత్తం రూ. 5,000 కోట్లకుపైగానే అక్రమాస్తులు బయటపడవచ్చని నీటిపారుదల శాఖలోనే చర్చ కొనసాగుతుండటం గమనార్హం.
మొత్తానికి విజిలెన్స్ కమిషన్ నివేదికలోని ఇంజినీర్ల జాబితాపై దృష్టి సారించిన ఏసీబీ.. తదుపరి దాడులు చేసేనాటికి ఇంజినీర్ల మంతనాల ప్రభావం కూడా బయటపడే అవకాశం ఉంది. అప్పటివరకు నెక్స్ ఎవరు అనే ఆలోచనలు ఉండనే ఉంటాయి.