బీఆర్‌ఎస్ హయాంలోనే కాళేశ్వరం కూలింది!

25-04-2024 02:24:37 AM

l అయినా కేసీఆర్ పట్టించుకోలేదు.. మరమ్మతులు చేయించలేదు

l ప్రాజెక్ట్‌కు కేసీఆరే ఇంజినీర్, ఆయనే క్వాలిటీ కంట్రోలర్

l కృష్ణా జలాలను ఏపీకి అప్పగించిన ఘనుడు ఆయనే: మంత్రి ఉత్తమ్

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని, అయినప్పటికీ ఆ ప్రభుత్వం మరమ్మతులు చేయలేదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్  హోటల్‌లో బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి , ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, బాలునాయక్, పీసీసీ అధ్యక్షుడు జగ్గారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘విద్యుత్ ఉత్పత్తిని 7 వేల మెగావాట్ల నుంచి 12 వేల మెగావాట్లకు పెంచామని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చెప్పడం అబద్ధం.

బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభించి, పూర్తి చేసింది ఒక భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మాత్రమే. అది కూడా కాలం చెల్లిన ప్రాజెక్టే. ఆ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై రూ.95 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్ట్‌కు కేసీఆర్‌నే ఇంజినీర్. ఆయనే క్వాలిటీ కంట్రోలర్. మేడిగడ్డ 2023 అక్టోబర్ 21న కుంగితే, తమ పార్టీ అధికారంలోకి వచ్చింది. మేడిగడ్డ కుంగిన తర్వాత 45 రోజుల వరకు కేసీఆర్ నోరు మెదపలేదు. కానీ నెపాన్ని మాత్రం మా ప్రభుత్వంపై నెడుతున్నార’న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు గట్టిగా బుద్ధి చెప్పారని, గెలిచిన 39 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో సుమారు 25 మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఎంపీ సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. నాటి సీఎం కేసీఆర్ వైఫల్యంతోనే రాష్ట్రానికి కృష్ణా జలాల పంపకంలో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఆయన ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో లాలాచిపడి ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు నష్టం చేశారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ రోజుకు 92 వేల క్యూసెక్కుల నీటిని వాడుకున్నదన్నారు. 2014కి ముందు శ్రీశైలం నుంచి రోజుకు 4.1 టీఎంసీల జలాలు ఏపీకి వెళ్లేదని, రాష్ట్ర విభజన తర్వాత రోజుకు 9.5 టీఎంసీల జలాలు ఏపీకి వెళ్తున్నాయని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం డిండి లిప్ట్ ఇరిగేషన్‌ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తుందన్నారు.

కేసీఆర్‌కు తెలివిలేదు: కోమటిరెడ్డి

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఏమాత్రం తెలివిలేదని, ఏం మాట్లాడుతున్నారో, ఎందు కు మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన సభపెడితే పట్టుమని 2 వేల మంది కూడా సభకు రావడం లేదని ఎద్దేవా చేశారు. మానేరు కాంట్రాక్ట్ పనులు తాను చేసినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారని, తనకు ఎ లాంటి కాంట్రాక్టులు లేవని స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాదన్నారు. 12 సీట్లలో డిపాజిట్ కూడా రాదన్నారు. లిక్క ర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కేసీఆర్ అంటున్నారని, ఆమె కడిగిన ముత్యమే అయితే ఈడీ ఎందుకు అరెస్ట్ చేస్తుందని ప్రశ్నించారు.