calender_icon.png 29 September, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల సుడిగుండంలో కమలాపురం

29-09-2025 12:00:00 AM

  1. పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్య పనులు 
  2. డ్రైనేజీల పరిస్థితి దయనీయం సీజనల్ వ్యాధులతో ప్రజల ఇక్కట్లు
  3. బ్లీచింగ్ ఫాగింగ్ కరువు ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలు సతమతం
  4. వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేపట్టాలి 

ములుగు, మంగపేట, సెప్టెంబరు 28 (విజయక్రాంతి): పేరుకే మేజర్ గ్రామపంచాయతీ పాలనలో మైనర్ గ్రామపంచాయతీ ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామం సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయింది. పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలనతో పారిశుద్ధ్య పనులు పడకేసాయి.ప్రజలకు మౌలిక సదుపాయాలైన తడిచెత్త పొడిచేత్త సేకరణ, డ్రైనేజీలు శుభ్రపరచడం, వీధిలైట్ల నిర్వహణలో పూర్తిగా విఫలం గ్రామంలో ఏ చెత్తకుండి దగ్గర చూసిన పడేసిన వ్యర్ధాలు దర్శనమిస్తున్నాయి.

ఇందుకు కారణం ప్రతిరోజు చెత్త సేకరణ చేయకపోవడం సైడ్ కాలువలో చెత్తతో నీరు నిలవడం వల్ల వచ్చే దుర్వాసన భరించలేక పోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీల పరిస్థితి దయనీయంగా మారడంతో జనం దోమలతో వేగలేకపోతున్నారు.డ్రైనేజీలలోని మురుగు నీటి కారణంగా దోమల బెడద అధికమవుతోంది.ఒకవైపు వర్షాకాలం వచ్చి సీజనల్ వ్యాధులు డెంగీ మలేరియా టైఫాయిడ్ తదితర వ్యాధులు విజృంభిస్తున్నాయి. గ్రామంలో కనీసం బ్లీచింగ్ చల్లించడం,ఫాగింగ్ (దోమల నియంత్రణ పొగ) పిచికారి చేయడంలాంటివి మరచారు.

ఇలాంటి సమస్యలతో ప్రజలు సతమతమైన పాలకులకు, అధికారులకు పట్టింపు లేదు. ఇది ఇలా ఉండగా గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామస్థుల కోసం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేసి 20 లీటర్ల క్యాన్ కు రూ 5 లకు అమ్ముతూ పంచాయతీకి కొంత సొమ్ము ఆదాయం రూపంలో వచ్చేది. గత సంవత్సరం కాలంగా వాటర్ ప్లాంట్ నిరుపయోస్థితిలో ఉంచి పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. త్వరగా వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేపట్టి శుద్ధ నీటిని అందజేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సమస్యల పరిష్కారానికి కృషి

కమలాపురం గ్రామపంచాయతీ పరిధిలో సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి ని అందిస్తున్నాను. ఇక పారిశుద్ధ్య పనుల విషయంలో మా సిబ్బంది ప్రతిరోజు మెయిన్ రోడ్డులో ఉన్న దుకాణాలు, రోడ్డు వెంబడి ఏర్పాటుచేసన చెత్తకుండిలో ఉన్న తడి పొడి చెత్త సేకరణ నిర్వహిస్తున్నారు.

సిబ్బంది కొరతతో గ్రామంలో చెత్త సేకరణలో జాప్యం జరుగుతుంది బ్లీచింగ్, ఫాగింగ్ మెటీరియల్ కు ఆర్డర్ పెట్టాము వచ్చిన వెంటనే వాడ వడల బ్లీచింగ్ చల్లడం దోమల నివారణకు దోమల మందును పిచికారి చేపిస్తాము. అదేవిధంగా మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేసి చాలా సంవత్సరాలు అవుతున్న కారణంగా మరమత్తులకు అధిక ఖర్చు అవుతుందని ప్లాంట్ మరమ్మత్తులు చేపించలేక పోతున్నాము.

పంచాయతీ కార్యదర్శి కమలాపురం, రంజిత్ కుమార్ అధిక భారం అవుతుంది

గ్రామపంచా యతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మత్తుల కారణాలతో మూసివేయడం వల్ల ఐదు రూపాయల వాటర్ క్యాన్ పది రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తుంది. రోజువారి కూలి పని చేసుకుని బ్రతికే వాళ్ళకి అధిక భారం అవుతుంది.

దూడపాక కొమరయ్య , కమలాపురం భరించలేని వాసన వస్తుంది

మా కాలనీలో డ్రైనేజీలు శుభ్రం చేయకనెలలు గడుస్తున్నాయి. ఎక్కడ చూసినా చెత్త చెదారం, సైడ్ కాలవలలో అయితే ఏపుగా పెరిగిన చెట్లు వాటి వల్ల కాలువలో మురుగునీరు నిలిచిపోయి భరించలేని వాసన వస్తుంది. దీనికి తోడు దోమలు వాటి వల్ల మాకు రోగాలు ఎప్పుడు వస్తాయో అనే భయంతో బతుకుతున్నాము.

భూక్య దేవి, ఇందిరా కాలనీ వాసి.