calender_icon.png 29 September, 2025 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి

29-09-2025 12:03:41 AM

-ప్రధాని, ముఖ్యమంత్రులు వాస్తవాన్ని కోర్టుకు సమర్పించాలి

-మాజీ ఎంపీ సోయం బాపూరావు

-ఆదివాసీ ఉద్యమాలకు అండదండగా ఉంటాం-: మాజీ ఎమ్మెల్యేలు  

-విజయవంతమైన ఆదివాసీ ధర్మయుద్ధం

భద్రాచలం, సెప్టెంబర్ 28,(విజయక్రాంతి): అక్రమంగా గిరిజన జాబితాలో చొరబడ్డ లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనీ. ఆ సమస్య పరిష్కారమయ్యేంత వరకు పోరాటాలు ఆపే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. చట్టబద్దత లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ గోండ్, కోయ, నాయకపోడు, పర్థాన్, కొలాం, ఆంథ్, తోటి, కొండరెడ్డి, చెంచు 9 తెగలు భద్రాచలంలో ఆదివారం చేపట్టిన ధర్మయుద్ధం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు సుమారు 50వేల మందికి పైగా తరలివచ్చారు. దీంతో పట్టణ పురవీధులన్నీ ఆకుపచ్చని జెండాలతో రెపరెపలాడాయి. డా.బీఆర్ అంబేద్కర్‌తో పాటు ఆదివాసీ నాయకులైన కొమరం భీమ్, గంటం దొర, మల్లు దొర, అల్లూరి సీతామరాజు విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన సభావేదిక వద్దకు గిరిజన సంప్రదాయ నృత్యాలతో వేలాదిగా ఆదివాసీలు కదిలివచ్చారు.

సభ ప్రారంభ సూచితకంగా అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య జ్యోతి ప్రజ్వల చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో బాపూరావు మాట్లాడుతూ లంబాడీలు దొడ్డిదారిలో గిరిజన జాబితాలో వచ్చి చేరి నిజమైన ఆదివాసీల హక్కులను, రాజ్యాంగం ప్రకారం అందాల్సిన ఫలాలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. లంబాడీలు గిరిజనులుగా చెలామణి అయ్యేందుకు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని, దీనిని కోర్టులో సవాల్ చేయగా వాదోపవాదాలు సాగుతున్నాయని చెప్పారు.

వాస్తవిక ఆధారాలతో ఆదివాసీ నాయకులు న్యాయ పోరాటాలు సాగిస్తున్నారని, ప్రధాని నరేంద్రమోడి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజాలను చిత్తశుద్ధితో కోర్టుకు సమర్పించాలని కోరారు. మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ అవకాలు చెవాకులు పేలుతున్నాడని. అడ్డదారిలో తమ హక్కులను అనుభవిస్తూ ఇష్టాను సారంగా పేలితే ఆదివాసీ జనాభా ఇక చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఆదివాసీల్లోనే లంబాడీలకు కోవర్టులుగా పనిచేసే ద్రోహులు ఉన్నారని, అలాంటివారితో తస్మత్ జాగ్రత్త అన్నారు.

భద్రాచలంలో మొదలైన ధర్మ యుద్ధం లంబాడీల గుండెల్లో గుబులు పుట్టిస్తోందని, సమస్య పరిష్కారం కాకుంటే ఇదే సూర్తితో రానున్న రోజుల్లో మేడారం, హైదారాబాద్లో పది లక్షల మందితో సభలు నిర్వహిస్తామని చెప్పారు.   అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, రేగా కాంతారావు, తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆదివాసీ సోదరులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు చెప్పారు. ఆదివాసీ ఐర్యకార్యచరణ కమిటీ చైర్మన్ చుంచు రామకృష్ణ మాట్లాడుతూ ఇందిరాగాంధీ లంబాడీలను గిరిజన జాబితాలో కలిపారని చెప్పారు.

కానీ వారు ఉత్తరాంధ్రా నుంచి అనేక కులాల నుండి వలస వచ్చారని, వారు నిజమైన ఆదివాసీలు కానేకాదని, వారివద్ద ఆధారాలుంటే చూపాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా విద్యార్ధి జేఏసి నాయకుల మైపతి అరుణ్ కుమార్ మాట్లాడుతూ   ఆదివాసీలు చేస్తున్న న్యాయమైన ధర్మయుద్ధానికి సహకరించాలని కోరారు.  కార్యక్రమంలో పొడియం బాలరాజు, కల్లూరి జయబాబు, కొర్సా జేజే రాంబాబు, పూనెం శ్రీనివాస్, తెల్లం వెంకటేశ్వర్లు, తెల్లం రమణయ్య, ముర్రంవీరభద్రం, ముర్ల రమే,వ, కోవా దలవత్ రావు, తెల్లం సీతమ్మ,పూనెం శ్రీను, పూనెం కృష్ణ దొర తదితరులు పాల్గొన్నారు.