16 June, 2026 | 2:37 AM

రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి

16-06-2026 01:27 AM

అడిషనల్ కలెక్టర్ వై వి గిరి 

కామారెడ్డి, జూన్ 15 (విజయ క్రాంతి): రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలుపాలని అదనపు జిల్లా కలెక్టర్ వై వి గిరి అన్నారు. సోమవారం కామారెడ్డి ఆర్కే డిగ్రీ కళాశాలలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్  వై వి గిరి మాట్లాడుతూ భారతదేశంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  సభ్యత్వ నమోదు ప్రత్యేక డ్రైవ్ కామారెడ్డి లోని ఆర్కే డిగ్రీ, పీజీ కళాశాలలో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. మే 15 నుండి జూన్ 15 వరకు ప్రభుత్వం విధించిన సభ్యత్వ నమోదు గడువు సోమవారం ముగియనుండటంతో,  ఈ ప్రత్యేక  కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా జిల్లా లేబర్ ఆఫీసర్ శశికుమార్, ఆర్కే విద్యాసంస్థల సీఈఓ యం.డాక్టర్ జైపాల్ రెడ్డి  పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్  సూచనతో ఆర్కే కళాశాల డాక్టర్ జైపాల్ రెడ్డి  పాట్రన్ మెంబర్ షిప్ తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు. సభ్యత్వ నమోదుకు చివరి రోజు కావడంతో విద్యార్థులు, యువత, సమాజ సేవకులు, ఉద్యోగ, వ్యాపార వాణిజ్య వేత్తలు, పౌరులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి జిల్లాను అగ్రస్థానంలో ఉంచాలని చెప్పారు. ఆర్కే కళాశాల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి  మాట్లాడుతూ 1000 రూపాయలతో జీవితకాల సభ్యత్వం పొందవచ్చు అన్నారు.

కేవలం రూ. 250 చెల్లించి జీవితకాల అసోసియేట్ సభ్యత్వం పొందే ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, సేవా కార్యక్రమాల్లో యువతే కీలకం అనీ ,విపత్తుల సమయంలో, రక్తదాన శిబిరాల నిర్వహణలో రెడ్ క్రాస్ పాత్ర అసామాన్యమైనదని, విద్యార్థులు తమ వంతు బాధ్యతగా సభ్యత్వం తీసుకోవాలని సూచించారు.ఈ  కార్యక్రమంలో  రాజన్న గారు, దత్తాత్రి, నవీన్, ప్రిన్సిపాల్స్, అధ్యాపక బృందం, విద్యార్థులు, యువత కేజీ టు పీజీ ఉపాధ్యాయులు అందరూ పాల్గొని ఆన్లైన్/ఆఫ్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు చేసుకున్నారు.