14-08-2025 05:57:31 PM
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ కిష్త్వార్ జిల్లాలోని చోసోటి గ్రామంలో గురువారం భారీ క్లౌడ్ బరస్ట్(Cloud Burst) చోటుచేసుకుంది. ఆకస్మికంగా సంభవించిన ఈ వరదల్లో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం నేపథ్యంలో ప్రసిద్ధ మచైల్ మాత యాత్రను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చోసోటి మచైల్ మాత ఆలయానికి వెళ్లే మార్గంలో వాహనాలు తిరగగల చివరి గ్రామాలలో ఒకటి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పద్దర్ సబ్ డివిజన్‌లో ఉన్న గ్రామం ఆకస్మిక భారీ వర్షాల కారణంగా స్తంభించిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ(Deputy Commissioner Pankaj Kumar Sharma), ఎస్‌ఎస్‌పి నరేష్ సింగ్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ నేతృత్వంలోని బృందం ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను ప్రారంభించింది.
సైన్యం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(SDRF) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని, శోధన కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, సహాయ చర్యలను మరింత వేగవంతం చేయాలని పౌర పరిపాలన, పోలీసులు, సైనిక దళాలను ఆదేశించినట్లు ఆయన ‘ఎక్స్’ వేదికపై తెలిపారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(Chief Minister Omar Abdullah)... ఈ సంఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. కిష్త్వార్‌లోని క్లిష్ట పరిస్థితిని, సహాయ కార్యకలాపాల వివరాలను ఆయనకు వివరించారు. క్షేత్రస్థాయి నుండి సమాచారం ఆలస్యంగా వస్తోందని, సహాయ కార్యకలాపాల కోసం అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరిస్తున్నామని ఆయన అన్నారు. మరోవైపు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా ఈ సంఘటనను ధృవీకరించారు. పరిపాలన వెంటనే స్పందించి సహాయ బృందాలను పంపిందని, నష్టాన్ని అంచనా వేసిన తర్వాత వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.