04-11-2025 03:50:24 PM
							భక్తులు భారీగా వచ్చే అవకాశం
"కాశీబుగ్గ" సంఘటనతో అప్రమత్తత అవసరం
వలిగొండ,(విజయక్రాంతి): పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలోని అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు పరమశివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి కార్తీక పౌర్ణమి నాడు వలిగొండ మండలంలోని సంగెం గ్రామం పరిధిలో గల త్రివేణి సంగమమైన మూసీ నది మధ్యలో గల భీమలింగేశ్వరుడని దర్శించుకునేందుకు ప్రతి సంవత్సరం భక్తులు పెరుగుతూనే ఉన్నారు. అయితే ఈసారి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
దీంతో భీమలింగాన్ని దర్శించుకునేందుకు నిర్వాహకులు భీమలింగం వద్దకు భక్తులు చేరుకునేందుకు రోడ్డు పనులను పూర్తి చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని కాశీబుగ్గలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకునేందుకు ఆలయ సామర్థ్యానికి మించి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రమాదం జరిగి తొమ్మిది మంది మృతి చెందడం జరిగింది. అయితే కాశీబుగ్గ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని నది మధ్యలో గల భీమలింగం వద్దకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చినట్లయితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం నిర్వాహకులు స్థానిక పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖలకు ముందస్తు సమాచారం అందించాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.