14-10-2025 06:52:07 PM
ఇఫ్కో ఎల్లప్పుడూ రైతులతో కలిసి ఉంటుంది..
నానో యూరియాతో రైతులు లాభాలు పొందవచ్చు..
తెలంగాణ రాష్ట్ర ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్..
నకిరేకల్ (విజయక్రాంతి): రైతులను అభివృద్ధి పథంలో నడిపించడంలో కట్టంగూరు ఎప్పిఓ ముందంజలో ఉందని, రైతులకు, ప్రతి వ్యవసాయ కార్యక్రమానికి పురుగు మందులు, డ్రోన్ స్ప్రేలు, ఎరువుల వినియోగం వంటి అన్ని అంశాల్లో ఇఫ్కో ఎల్లప్పుడూ రైతులతో కలిసి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ శ్రీ కృపా శంకర్ పేర్కొన్నారు. మంగళవారం కట్టంగూరు మండలంలోని గంగాదేవి గూడెం శివారులో కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ లో నేడు ఇఫ్కో షాపుల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ఇఫ్కో మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్, నల్గొండ జిల్లా మేనేజర్ వెంకటేష్ నాబార్డ్ సూర్యాపేట, భువనగిరి జిల్లా మేనేజర్ రవీంద్ర నాయక్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా కృపా శంకర్, వెంకటేష్ లు మాట్లాడుతూ, నానో యూరియా ఉపయోగం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చని వారు తెలిపారు.
ఒక 500ml నానో యూరియా బాటిల్ 45 కిలోల యూరియాకు సమానమని వారు వివరించారు. కట్టంగూర్ ఎఫ్పిఓ వాడుకలోకి తెచ్చిన డ్రమ్ స్ప్రేయర్స్, హోండా స్ప్రేయర్స్, కాటన్ స్ప్రేయర్స్ రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని వారు ప్రశంసించారు. ప్రాణధార చైర్మన్ పుండరీకాక్షుడు మాట్లాడుతూ, ఆరుతడి పంటలలో రైతుల ఆదాయం పెంచుకోవచ్చు అన్నారు, పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు అన్నారు. దిగుబడులు 3, 4 బస్తాలు పెరగడం వంటి చర్యలను ప్రాణధార సంస్థ చేపట్టిందని వారు తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణలో కట్టంగూర్ ఎప్పిఓను తెలంగాణలో నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏప్పిఓ అడ్వైజర్ నంద్యాల నరసింహారెడ్డి ఐఆర్డీఎస్ చైర్మన్ రమేష్, కట్టంగూర్ ఎప్పిఓ చైర్మన్ సైదమ్మ, డైరెక్టర్లు అనంత రెడ్డి, ధర్మారెడ్డి, వెంకన్న, సీఈఓ రమేష్, ప్రాణధార పుండరీకాక్షుడు, సురేష్, కోణం ఫౌండేషన్ అంజయ్య, పరశురాం రైతులు, తదితరులు పాల్గొన్నారు.