06-12-2025 12:00:00 AM
కల్లు డిపో, గుట్కా వ్యాపారులను బెదిరించి వసూలు చేసింది.
కాంట్రాక్టు కంపెనీల ద్వారా ప్రశాంత్ రెడ్డి దోచుకున్నారు.
నిజామాబాద్, డిసెంబర్ 5 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో తాజా మాజీ ల మధ్య విమర్శల పర్వం షురూ అయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. వేముల ప్రశాంత్ రెడ్డి కవిత పరస్పర ఆరోపణల వల్ల స్పష్టమవుతోంది.మాజీ మంత్రి, మాజీ ఎంపీ లు ఒకరిపై మరొకరు మాటల తూటాలతో రాజకీయ వాడి వేడి రంజుగా సాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిజామాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్ ను రగిలిస్తున్నారూ.. మొన్నటిదాకా ఒకే పార్టీలో, ఒకే ప్రభుత్వంలో కలిసిమెలిసి నడిసిన ఆ నాయకుల మధ్య రాజుకున్న వివాదం రోజురోజుకి ముదురుతోంది.
నిజామాబాద్ జిల్లా లో రాజకీయ రంగస్థలం లో మాజీల మధ్య మాటల యుద్ధం మొదలైనది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు, తెలం గాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఆరోపణలు, విమర్శల విషయంలో ముఖ్య నేతలు కాస్త పద్ధతిగా మాట్లాడుతుoటే..వారి అనుచరులు మాత్రం దుమ్మెత్తి పోసుకుంటున్నారూ. గతంలో చేసిన అవినీతి, అక్రమాలను బహిరంగ పరుస్తూ ఒకరి చుట్ట ఒకరు ఎక్కుతున్నారు. ప్రజలు ఈ ఆరోపణలు ప్రత్యా రూపంలో ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దుమారం రేపుతున్న ఈ ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశ మైంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి అటు కవిత, ఇటు ప్రశాంత్ రెడ్డి కీలక భూమిక పోషించారు. బతుకమ్మ ద్వారా జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఊపు తేవడంలో కవిత ముఖ్య పాత్ర పోషిస్తే, జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేయడంలో, ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో వేముల సురేందర్ రెడ్డి అతని తయుడు ప్రశాంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత నిజామాబాద్ ఎంపీగా కవిత, బాల్కొండ నుంచి వేముల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలోనే వేములకు కీలకమైన మిషన్ భగీరథ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత రెండోసారి ప్రభుత్వం వచ్చాక వేములకు మంత్రి పదవి వరించింది. ఐతే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత అనూహ్యంగా ఓటమి పాలయ్యారూ. అయినప్పటికీ అటు వేముల, ఇటు కవిత జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు.
దాదాపు రెండు దశాబ్దాల పాటు కలిసిమెలిసి పని చేసిన ఈ ఇద్దరి మధ్య ఇటీవల అగాధం పెరిగిపోయింది బీఆర్‌ఎస్ నుంచి కవితను వెలివేయడంతో ఆమె జాగృతిని బలోపేతం చేసుకునే పనిలో పడ్డారు. ఈక్రమంలో జిల్లాలు పర్యటిస్తున్న ఆమె తరచూ ప్రశాంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారూ. ఇటీవల మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించిన కవిత మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వేముల గత పదేళ్లలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వేములకు ఉన్న ఆస్తులు ఎన్ని..? ఇప్పుడున్న ఆస్తులు ఎన్ని? అని కవిత ప్రశ్నించారు.
కాంట్రాక్టులు, కంపెనీల పేరిట భారీగా దోచుకున్నారని విమర్శించారు. పనులు చేయకుండా బిల్లులు లేపుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒక్క చుక్క కూడా నీరు రాలేదన్నారు. అయితే, కవిత ఆరోపణలను వేముల తిప్పికొట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరు ఎక్కడ ఉన్నారో జిల్లా ప్రజలకు తెలుసన్నారు. ఉమ్మడి జిల్లాకు కాళేశ్వరం నీళ్లు రాలేదని ఆమె చెప్పడం అవాస్తవమని కొట్టిపడేశారు. శ్రీరాంసాగర్ రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి జలాలను ఎదురెక్కించి ఎస్సారెస్పీలో నింపింది వాస్తవం కాదా అని ప్రశాంత్ రెడ్డి కవితకు ఎదురు ప్రశ్న వేశారు.
మల్లన్నసాగర్ నుంచి లెండి వాగు ద్వారా నిజాంసాగర్ లోకి నీళ్లు తెచ్చింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కవిత చేస్తున్న ఆరోపణలు ఎవరి ప్రయోజనం కోసమని వేముల ప్రశ్నించారు రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడుతున్న రేవంత్ రెడ్డిని ఎందుకు నిలదీయరని అడిగారు. ముఖ్య నేతలు ఇలా బజారున పడి విమర్శలు చేసుకుంటుంటే, వారి అనుచరులు మరింత రెచ్చిపోతున్నారూ. తమ నాయకుడినీ, తమ నాయకురాలిని అంటారా? అని ఒకరినొకరు తిట్టి పోసుకుంటున్నారూ. కవిత విమర్శలను సోషల్ మీడియా ద్వారా తిప్పికొట్టిన వేముల అనుచరులు నిజామాబాద్ కేంద్రం లో మీడియా సమావేశం పెట్టి మరీ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
లిక్కర్ రాణి అయిన కవిత మచ్చలేని ప్రశాంత్ రెడ్డిపై కవిత ఆరోపణలు చేయట మెంటని ప్రశ్నిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు వ్యాపారంలో సంపాదించిన వేముల తెలంగాణ ఉద్యమ సమయంలో ఖర్చు పెట్టిన వ్యక్తి అని, మీలా బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదనీ కవితపై వేముల అభిమానులు మండిపడుతున్నారు. జిల్లాలో కే ట్యాక్స్ నడుస్తున్న దన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసేనని వారు గుర్తు చేశారు.
ఎంపీగా ఉన్నప్పుడు బోధన్, బాన్సువాడలో మంజీర ఇసుక నుంచి కోట్లు దోచుకున్నది ఎవరో, కల్లు డిపో వ్యాపారుల దగ్గర, గుట్కా వ్యాపారుల దగ్గర డబ్బులు తీసుకున్నది ఎవరో ప్రజలందరికీ గుర్తుందని మండిపడుతున్నారూ. వేముల వర్గీయుల ఆరోపణల నేపథ్యంలో కవిత అనుచరులు తెర పైకి వచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం లో మీడియా సమావేశం పెట్టి ప్రశాంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు సంధించారు.
మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్‌గా, మంత్రిగా అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. మరోసారి కవిత జోలికొస్తే ఊరుకునేది లేదని, తాటా తీస్తామని వేములను కవిత అనుచరులు బహిరంగంగానే హెచ్చరించారు. మొత్తానికి ఇద్దరు ముఖ్య నేతల మధ్య నడుస్తున్న మాటల యుద్ధం జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోంది.ఈ వేడి త్వరలో చల్లారుతోందా..? లేక ఒక రి అవినీతి బాగోతం మరొకరు విప్పి ప్రజల మధ్య చులకన అవుతారా..? ఈ లొల్లి ఎటూ తిరిగి ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి.