calender_icon.png 22 July, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల కోసం నిరీక్షణ!

22-07-2025 12:00:00 AM

సమీపిస్తున్న స్థానిక ఎన్నికలు ఖరారు కాని రిజర్వేషన్లు ఆశావాహుల్లో ఉత్కంఠ

కామారెడ్డి, జూలై 21 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావావుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయకపోవడంతో అవకాశం ఎవరికి వస్తుంది? ఎవరికి చేజారుతుందోనని ఆందోళన వ్యక్తమవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు  షెడ్యూల్ ప్రకటించిన వారంరోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్న విషయం తెలుసుకుంటున్న.

ఆశావాహుల్లో రిజర్వేషన్ల ఖరారు టెన్షన్ పట్టుకుంది. కామారెడ్డి జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు ఉండగా 862 ఎంపీటీసీ స్థానాలు, జడ్పీటీసీ స్థానాలు 25, 25 ఎంపీపీ లకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. 

రిజర్వేషన్ కలిసి వస్తేనే పోటీకి..

తమకు రిజర్వేషన్లు కలిసి వస్తేనే పోటీ చేసేందుకు అవకాశం ఉంటుం దని పలువురు ఆశావహులు చర్చించుకుంటున్నారు. ప్రభు త్వం రిజర్వేషన్లను ఖరారు చేయకపోవడంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్లు కలిసి వస్తేనే పోటీకి సిద్ధంగా ఉంటామని కొందరు చెప్తుండగా..

తమకు అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చే విధంగా చూడాలని స్థానిక ఎమ్మెల్యేల వద్ద ఆశావాహులు  మొరపెట్టుకుంటున్నారు. తమకు రిజర్వేషన్ అనుకూలంగా వస్తే గెలిచి తీరుతామని, లేదంటే తమ ఆశలు గల్లంతేనని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. 

మద్దతిచ్చేలా ఒప్పందాలు

త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో పలువురు ఆశావహులు గందరగోళానికి గురవుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు అయ్యేవరకు పోటీపైన ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. రిజర్వేషన్లు కలిసి వస్తే తమకు మద్దతు ఇవ్వాలని లేకుంటే మీకు అనుకూలంగా రిజర్వేషన్లు కలిసి వస్తే మద్దతు ఇస్తామంటూ ఒప్పందాలు చేసుకుంటున్నారు.

పార్టీలు పక్కన పెట్టి గ్రామ అభివృద్ధికి, తమకు రాజకీయ అవకాశం కలిసి వచ్చేందుకు రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకునేందుకు పోటీ ఏకైక మార్గమని భావిస్తున్నారు.

పోటీకి కొత్త వాళ్ళు తహతహ 

స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉండాలని పాత వారు చూస్తుండగా, కొత్తవారు మాత్రం తాము పోటీలో ఉంటామంటే తాము పోటీలో ఉంటామంటూ ప్రకటించుకుంటున్నారు. కుల సంఘాలలో మద్దతు కోసం చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో ఏ కార్యక్రమం నిర్వహించినా పాల్గొంటూ పోటీలో ఉంటే తమకు అవకాశం ఇవ్వాలని మాట తీసుకుంటున్నారు. గెలిపిస్తే అండగా నిలుస్తానని కుల సంఘాలకు హామీలు కూడా ప్రకటించేస్తున్నారు.