20-09-2025 12:23:07 AM
విజయక్రాంతి నెట్‌వర్క్, సెప్టెంబర్ 19: ఆదిలాబాద్ జిల్లాలో యూరియా పంపిణీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూరియా టోకెన్ల పంపిణీలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఏఎస్‌ఐ ఓ రైతును మోచేతితో నెట్టేశాడు. యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఆదిలాబాద్ జిల్లాలోనే ఇదే పరిస్థితి ఉంది. శుక్రవారం జిల్లాలోని బేల మండల కేంద్రంలో యూరియా పంపిణీ చేస్తున్నట్టు తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక మంది రైతులు తరలివచ్చారు.
యూరియా బస్తాలకు టోకెన్లను పంపిణీ చేసే సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. క్యూలైన్‌లో నిల్చున్న రైతుల వద్దకు ఏఎస్‌ఐ జీవన్ వెనుక నుంచి వచ్చారు. రైతుల సంఖ్య అధికంగా ఉండటంతో తోపులాటలో ఓ రైతు ఏఎస్‌ఐ మీద పడబోయాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఏఎస్‌ఐ ఓ రైతును మోచేతితో నెట్టేశాడు. అంతటితో ఆగకుండా రైతు పైకి మరో చేయి ఎత్తాడు. దీంతో రైతులకు, ఏఎస్‌ఐకి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు అక్కడ ఉన్నరైతులై సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది.
అనంతరం రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో యూరియా కోసం వేలాదిగా రైతులు బారులు తీరారు. ఐదు రోజుల నుంచి యూరియా సప్లయ్ లేకపోవడంతో.. లారీ లోడు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా తరలివచ్చారు. కారేపల్లి మండలంలోని ఆయా గ్రామాల నుంచి దాదాపు 3 వేలకు పైగా రైతులు వచ్చి కూపన్ల కోసం క్యూలైన్‌లో నిల్చున్నారు. పలుచోట్ల రైతులు మధ్య తోపులాటలు జరిగాయి. ఈ తోపులాటలో కారేపల్లి ఏవో అశోక్ కుమార్ స్పృహ కోల్పోయారు.
దీంతో ఆయన్ను దవాఖానకు తరలించారు. రైతులు కలుగజేసుకొని రైతులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్‌కు కూపన్ల పంపిణీని మార్చారు. మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా శుక్రవారం 600 టన్నుల యూరియాను సరఫరా చేశారు. జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల బయ్యారం, గార్ల, డోర్నకల్ తదితర మండలాల్లో పంపిణీని పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అడిషనల్ కలెక్టర్లు జిల్లావ్యాప్తంగా పర్యటించారు. రైతు భరోసా డేటా ఆధారంగా రైతులకు యూరియా పంపిణీ చేయడంతో కాస్త రద్దీ తగ్గింది. రైతులకు యూరియా ఇబ్బందులు లేకుండా చూస్తామని కలెక్టర్ భరోసానిచ్చారు.