11-10-2025 12:17:06 AM
ఖమ్మం, అక్టోబరు 10 (విజయక్రాంతి): ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.శుక్రవారం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణపై మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టేందుకు సోమవారం (అక్టోబర్ 13) నుంచి ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ 10 రోజుల పాటు చేపట్టడం జరుగుతుందని అన్నారు.నగర వ్యాప్తంగా పేరుకు పోయిన చెత్తను శుభ్రం చేయాలని, మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జవాన్ నుంచి సహాయ కమీషనర్ వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని అన్నారు.
చెత్త తో ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసిన తర్వాత ముందు, ఆ తరువాత తేడాను తెలియజేసేలా ఫోటోలు తీయాలని, ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన అదనపు లేబర్, ఎక్విప్మెంట్ అందుబాటులో పెట్టడం జరుగుతుందని అన్నారు.నగరంలోని ప్రధాన రోడ్లు, అంతర్గత రోడ్లలో ఎక్కడ చెత్త ఉండకుండా శుభ్రం చేయాలని, వర్షాల వల్ల పేరుకుపోయిన మట్టి తొలగించాలని అన్నారు.
జవాన్ వారీగా రోజుకు ఏ ప్రాంతంలో ఎన్ని కిలోమీటర్ల రోడ్లు శుభ్రం చేస్తున్నారు తెలియజేసేలా ప్రొఫార్మా తయారు చేయాలని అన్నారు. ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ క్రింద శానిటేషన్ నిర్వహించిన ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, అక్కడ ఎటువంటి మార్పు లేకుండా అపరిశుభ్రంగా ఉన్నట్లు తెలిస్తే సంబంధిత జవాన్, ఇతర అధికారులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు.
ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ సందర్భంగా శానిటేషన్ జవాన్, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు జవాన్ తన పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు ఉదయం సకాలంలో రిపోర్ట్ చేసేలా చూడాలని, అందరికంటే ముందే జవాన్ వచ్చి ఫీల్ లో ఉండాలని, వార్డు అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.నగర వ్యాప్తంగా ఉన్న డ్రైయిన్ పూడిక తీత పనులు చేపట్టాలని అన్నారు.
ఏ రోజు తీసిన పూడికతీత అదే రోజు అక్కడి నుంచి తొలగించేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. పబ్లిక్ పార్క్, బస్ స్టాప్స్, పబ్లిక్ టాయిలెట్స్ పూర్తిగా శుభ్రం చేయాలని అన్నారు.నగరంలో ఉన్న ఖాళీ స్థలాలను 100 శాతం శుభ్రం చేయాలని, అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించాలని అన్నారు. ప్రైవేట్ ఖాళీ స్థలాలు శుభ్రం చేసుకునేలా యజమానులకు నోటిసులు జారీ చేయాలని అన్నారు.
రోడ్డు మీద నిర్మాణ వ్యర్థాలు, ఎక్కడ ఇసుక, కంకర వంటి నిర్మాణ పదార్థాలు ఉండటానికి వీలు లేదని అన్నారు. నగరంలో ఎక్కడ పిచ్చి మొక్కలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగరంలో ఉన్న ఫుట్ పాత్ లను నీటితో కడిగి శుభ్రం చేయాలని అన్నారు.నగరంలో హోటల్స్, వ్యాపార, వాణిజ్య సంస్థలు బయట ఎక్కడైనా చెత్త వేసినట్లయితే వారి లైసెన్సులు రద్దు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రత్యేక పారిశుద్ద్య డ్రైవ్ ద్వారా వచ్చిన మార్పు స్పష్టంగా తెలియజేసేలా రికార్డు మెయింటెయిన్ చేయాలని అన్నారు. ప్రతి చోట శుభ్రం చేయడానికి ముందు, తర్వాత పరిస్థితులను వివరించేలా ఫోటోలు తీయాలని అన్నారు. 10 రోజులకు సంబంధించి జవాన్ కు కార్యాచరణ అందించాలని అన్నారు.
నగరంలో 15 రోజులలో ప్రధాన రహదారిపై ఎక్కడా గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ కమీషనర్ అనిల్ కుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు,సూపర్వైజర్, జవాన్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.