03-01-2026 12:00:00 AM
తొడసం వంశస్థుల ప్రత్యేక పూజలు
ఉట్నూర్, జనవరి 2 (విజయక్రాంతి) : పుష్యమాసం వచ్చిందంటే చాలు ఆదివాసీలు తమ ఆరాధ్య దైవాలకు పూజలు చేపడుతూ జాతరలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ మాసంలో వివిధ ప్రాంతాల్లోనీ దేవతలకు వివిధ తెగలకు చెందిన ఆదివాసీలు నియమనిష్టలతో పూజలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే నార్నూర్ మండల కేంద్రంలో కొలువుదీరిన తొడసం వంశస్థుల ఆరాధ్య దైవం ఖాందేవ్ (పెద్దపులి) పూర్ణిమ సందర్భంగా శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు చేసి జాతరను ప్రారంభించారు.
ఖాందేవ్ దేవుడి పూజలకు చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని చంద్రపూర్, తదితర ప్రాంతాల నుంచి తొడసం వంశస్థులు ఎడ్ల బండ్ల లో పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. దేవుడి పూజల సందర్భంగా దూరప్రాంతల వచ్చిన తొడసం వంశస్తులకు తొడసం వంశం పటేల్ లు రాజు పటేల్, భీంరావు పటేల్, బాపూరావు పటేల్, కటోడ ఆనందరావు, కటోడ మోతిరామ్,
ఆలయం సలహాదారుడు తొడసం నాగోరావు వారిని ఆహ్వానించారు. అనంతరం ఖాందేవ్ కు ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయం, ఆచారం ప్రకారంగా డోలు సన్నాయిలు వాయిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి చేపట్టే పూజలతో మొదలైన ఖాందేవ్ జాతర 15 రోజుల పాటు జరగనుంది.