13-09-2025 02:56:27 AM
-ప్రియుడితో కలిసి కసాయి తల్లి ఘాతుకం
-ఆ తర్వాత ఏపీకి పారిపోయిన నిందితులు
-నరసరావుపేటలో పట్టుకున్న పోలీసులు
-ఫోరెన్సిక్ సిబ్బందితో చిన్నారి మృతదేహం వెలికితీత
-మెదక్ జిల్లా శభాష్‌పల్లిలో ఘటన
శివంపేట, సెప్టెంబర్ 12: ప్రియుడి మోజులో పడి రెండేళ్ల కూతురిని చంపి, పాతిపెట్టిన కసాయి తల్లి ఉదంతం మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని శభాష్‌పల్లి గ్రామంలో వెలుగు చూసింది. శభాష్‌పల్లి గ్రామానికి చెందిన మమతకు ఏడు సంవత్సరాల క్రితం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం దొడ్లపల్లి గ్రామానికి చెందిన భాస్కర్‌తో వివాహం జరిగింది.
వీరికి కొడుకు, కూతురు తనుశ్రీ(2)ఉన్నారు. తల్లిగారి గ్రామమైన శభాష్‌పల్లికి చెందిన ఫయాజ్‌తో మమతకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో గతేడాది వీరిద్దరు కలిసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. తల్లితోనే కూతురు తనుశ్రీ కూడా ఉన్నదని భావించిన మమత కుటుంబ సభ్యులు.. వారు కనిపించడంలేదని నాలుగు నెలల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేటలో పట్టుకున్నారు. వారి వద్ద తనుశ్రీ లేకపోవడంతో పోలీసులు విచారించగా.. ప్రియుడితో కలిసి చంపి, పాతిపెట్టినట్టు మమత చెప్పింది. శభాష్‌పల్లి గ్రామ శివారులోని కొత్తకుంట వద్ద పాతి పెట్టామని చెప్పడంతో శుక్రవారం పోలీసులు, ఫొరెన్సిక్ సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి తవ్వగా చిన్నారి అస్థిపంజరం బయపటపడింది.