calender_icon.png 28 November, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కింగ్ ప్రాక్టీస్ షురూ

28-11-2025 12:23:23 AM

రాంఛీ, నవంబర్ 27 : సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముగియడంతో టీమిండియా ఇప్పుడు వైట్‌బాల్ సిరీస్‌లకు రెడీ అవుతోంది. ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. తొలి మ్యాచ్‌కు రాంఛీ ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే రాంఛీ చేరుకున్న టీమిండియా శుక్రవారం నుంచి ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. మరోవైపు ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న విరాట్ కోహ్లీ రాంఛీలో ప్రాక్టీస్ మొదలుపెట్టారు.

స్థానిక బౌలర్ల చేత బౌలింగ్ చేయించుకున్న కోహ్లీ నెట్స్‌లో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు. 2027 ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న విరాట్ ఇటీవల ఆసీస్‌తో సిరీస్ ద్వారా ఫామ్ అందుకున్నాడు. రోహిత్‌తో కలిసి చివరి వన్డేలో చూడచక్కని ఇన్నింగ్స్ ఆడాడు. వరల్డ్ కప్‌లోపు జరిగే ప్రతీ వన్డే సిరీస్‌లోనూ బరిలోకి దిగడం, దేశవాళీ క్రికెట్ కూడా ఆడేందుకు కోహ్లీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో తన ఫామ్ కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడు. ఇదిలా ఉంటే వన్డే సిరీస్ కోసం గిల్ అందుబాటులో లేకపోవడంతో టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌కు బాధ్యతలు అప్పగించారు. వన్డే సిరీస్‌కు రాంఛీతో పాటు రాయ్‌పూర్, విశాఖపట్నం ఆతిథ్యమిస్తున్నాయి. ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇరు జట్లు ఐదు టీ ట్వంటీలు ఆడనున్నాయి.