calender_icon.png 30 July, 2025 | 2:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలిగి వెళ్లిపోయిన కోమటిరెడ్డి

30-07-2025 01:08:09 AM

  1. బేగంపేట ఎయిర్‌పోర్టుకు సమయానికిరాని ఉత్తమ్
  2. అసహనంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయిన కోమటిరెడ్డి
  3. కోమటిరెడ్డి లేకుండానే తెరుచుకున్న సాగర్ గేట్లు

నాగార్జున సాగర్, జూలై 29: హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి హెలికాప్టర్‌లో నాగార్జున సాగర్ వెళ్లేందుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ వేచి ఉన్నారు. అయినా ఉత్తమ్ రాకపోవడంతో అసహనానికి గురైన కోమటిరెడ్డి అటు నుంచి అటే తన నివాసానికి వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉదయం 9 గంటలకే బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

నిజానికి ఉదయం 8.40 గంటలకే ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో నాగార్జున సాగర్‌కు ముగ్గురు మంత్రులు బయలుదేరాల్సి ఉంది. అయితే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 10 గంటల వరకు కూడా ఎయిర్‌పోర్టుకు రాలేదు. తమను ఉదయం 9 గంటలకే ఎయిర్‌పోర్టుకు రావాలని చెప్పిన ఉత్తమ్..

ఇంత ఆలస్యంగా ఎలా వస్తారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉత్తమ్ ఆలస్యంపై ఆగ్రహించిన కోమటిరెడ్డి అలిగి బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచే తన నివాసానికి వెళ్లిపోయారు. దీంతో మంత్రి కోమటిరెడ్డి లేకుండానే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ హెలికాప్టర్‌లో నాగార్జునసాగర్‌కు బయలుదేరి వెళ్లి, సాగర్ గేట్లను తెరిచారు.