30-07-2025 01:08:18 AM
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
పరకాల / హనుమకొండ టౌన్, జూలై 29 (విజయ క్రాంతి): పరకాల పట్టణం దినదినం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం పరకాల పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో 15వ ఆర్థిక సంఘం, టైడ్ గ్రాంట్స్ ద్వారా రూ. 47.74 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన జెసిబి యంత్రం, అదేవిధంగా రూ. 87.55 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 6 స్వచ్ఛ ఆటోలను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అధికారులు, స్థానికుల సమక్షంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు.
పారిశుద్ధ్య సిబ్బందికి ఎమ్మెల్యే, కలెక్టర్ల చేతుల మీదుగా దుస్తుల పంపిణీ చేశారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే, కలెక్టర్ మొక్కలు నాటారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మెప్మా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ ను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అనేక ప్రాధాన్య కార్యక్రమాలతోపాటు పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలకు ప్రాధాన్యత నిస్తుందన్నారు.
గ్రామాలు, పట్టణ ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యతని ఇస్తుందని, ప్రజా ప్రతినిధుల బాధ్యత కూడా అని పేర్కొన్నారు. పరకాల పట్టణంలోని పలు డివిజన్లను పరిశీలించినప్పుడు 34 వేలకు పైగా జనాభా ఉన్నారని, పరకాల పట్టణం దినదినం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. పరకాలకు చరిత్ర ఉందని అన్నారు. రజాకార్ల ఉద్యమంలో, స్వాతంత్య్ర ఉద్యమంలో ఇక్కడి నుండి పాల్గొన్న వారు ఉన్నారని గుర్తుకు చేశారు. ఇక్కడ ఉద్యమకారులు రజాకారుల చేతుల్లో ఊచ కోత కోయబడ్డారని అన్నారు.
దానికి గుర్తుగా రకాల పట్టణంలో అమరధామం నిర్మించారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పరకాల పురపాలక సంఘానికి ఒక్కో స్వచ్ఛ ఆటోను 15 లక్షల వ్యయంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రజలు తడి పొడి చెత్తగా వేరు చేయాలని సూచించారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో చెత్త, వ్యర్ధాల నిర్వహణ సమస్యగా మారిందన్నారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు తడి పొడి చెత్త నిర్వహణకు సంబంధించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, పరకాల పురపాలక సంఘం కమిషనర్ సుష్మ, ఆర్డిఓ డాక్టర్ కే.నారాయణ, తహసిల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో ఆంజనేయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
పరకాల పట్టణంలో పలువురు లబ్ధిదా రులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇండ్ల నిర్మాణ పనుల పురోగతి గురించి లబ్ధిదారులు, అధికారులతో కలెక్టర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు కలెక్టర్ సూచించారు. అదేవిధంగా సైడ్ డ్రైనేజీలను పరిశీలించారు.