calender_icon.png 3 May, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో కొత్తగూడ అడవి బిడ్డల ప్రభంజనం

02-05-2025 12:00:00 AM

100 శాతం ఉత్తీర్ణత, 24 సంవత్సరాల రికార్డు బ్రేక్ 

మహబూబాబాద్, మే 1 (విజయ క్రాంతి): పదో తరగతి పరీక్షా ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన అడవి బిడ్డలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. గిరిజన షెడ్యూల్ ఏరియాగా గుర్తింపు పొందిన కొత్తగూడ మండలంలో 4 జిల్లా పరిషత్ పాఠశాలలు, 3 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఒకటి గిరిజన బాలికల గురుకులం, ఒక కస్తూరిబా గాంధీ బాలికా పాఠశాలలున్నాయి.

ఆయా పాఠశాలల్లో పదో తరగతి చదివిన 238 మంది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా కృషి చేసిన ఉపాధ్యాయుల కల, విద్యార్థుల శ్రమ నెరవేరింది. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నిరంతర పర్యవేక్షణ, డీఈవో రవిందర్ రెడ్డి ఆదేశానుసారం పది విద్యార్థులకు పాఠశాలల వారీగా రోజు ప్రత్యేక తరగతులు నిర్వహించడం,

ఆ సమయంలో దాతల సహకారంతో విద్యార్థులకు స్నాక్స్, ఫలహారాలు  అందిస్తూ మండల విద్యా శాఖ అధికారి గుమ్మడి లక్ష్మి నారాయణ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపారు. సమిష్టి కృషి, ఉపాధ్యాయులు అంకిత భావంతో పని చేసి వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పదిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యార్థులను ప్రతి రోజు సాధన చేయించారు. 

ఇక్కడ కూడా అమ్మాయిలే టాపర్లు

పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో బాలికలదే పైచేయిగా నిలువగా 100 శాతం ఉత్తీర్ణత సాధించిన కొత్తగూడ మండలంలో కూడా బాలికలే అత్యున్నత మార్కులతో ఉత్తీర్ణులై మండలంలో టాప్ 10 లో నిలవడం విశేషం. మండలంలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన మొదటి పది మందిలో 9 మంది అమ్మాయిలే  500 మార్కుల పైన సాధించి పట్టు నిలుపుకున్నారు. 500 మార్కులు సాధించిన వారు మొత్తం 45 మంది ఉండగా వారిలో  టాప్ 10 లో నిలిచిన విద్యార్థులు వీరే.

1. ఎన్. రుద్రమ్మ - 552 (టి.జి.యు.ఆర్.జె.సి- కొత్తగూడ), 2. బి. లిఖిత - 549,  (టి.జి.యు.ఆర్.జె.సి- కొత్తగూడ), 3. ఎస్. అజయ్- 547  (ఎం ఎస్ ఎస్- కొత్తగూడ), 4. జె. మధుప్రియ - 544  (టి.జి.యు.ఆర్.జె.సి- కొత్తగూడ), 5. బి. మేఘన -540  (టి.జి.యు.ఆర్.జె.సి- కొత్తగూడ), 6. ఈ. పావని- 537 (టి.జి.యు.ఆర్.జె.సి- కొత్తగూడ), 7. జి. రాఘవి -531     ( కె.జి.బి.వి - కొత్తగూడ), కె. భాను శ్రీ -531  ( కె.జి.బి.వి - కొత్తగూడ), 8. కె. సాహిత్య-529 ( జడ్పీహెచ్‌ఎస్- పొగుళ్లపల్లి, ఎస్. గీత- 529, (టి.జి.యు.ఆర్.జె.సి- కొత్తగూడ), 

 9. వి. గ్రేసియా -527 (టి.జి.యు.ఆర్.జె.సి- కొత్తగూడ), 10. బి. సుమశ్రీ -524 టి.జి.యు.ఆర్.జె.సి- కొత్తగూడ), 100 ఉత్తీర్ణత సాధించడంతోపాటు అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులకు ఎం ఈ వో లక్ష్మీనారాయణ అభినందించారు. పదో తరగతి ఫలితాల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఉన్నత చదువులు కొనసాగించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే వీరి ఉత్తీర్ణతకు కృషి చేసిన ప్రధానోపాధ్యాయులకు, విషయ బోధకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.