10-07-2025 01:23:37 AM
కృష్ణా జలాలను అప్పనంగా ఏపీకి అప్పగించారు
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణా జలాశయాలను అప్పనంగా అప్పగించిన ఘనత ముమ్మాటికీ బీఆర్‌ఎస్ పాలకులదేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఏపీతో కుమ్మక్కు నీటి మల్లింపులకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. కృష్ణా జలాశయాలను ఏపీకి అక్రమంగా తరలింపు, తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చిన అంశాలపై బుధవారం ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌లతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రు లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వినోద్ పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడు తూ గత పదేళ్లలో కృష్ణా జలాశయాలలో తెలంగాణకు రావలసిన నీటి వాటాను రాబట్టుకోవడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 నుంచి 2014 వరకు 245.3 టీఎంసీల నీటిని ఏపీకి తరలించుకు పోగా 2014 నుంచి 2024 వరకు 1,192.44 టీఎంసీలకు పెరిగిందని వివరించారు. తద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ప్రాజెక్టుల విస్తరణకు మార్గం సుగమం అయిందన్నారు. ఈ పనులన్నీ కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా ఏపీ పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి చేపట్టారని తెలిపారు. బీఆర్‌ఎస్ కేఆర్‌ఎంబీకి గాని, కేంద్ర జల సంఘం వద్ద ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం శోచనీయమన్నారు.
ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాలకు లోబడి..
రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి 2025 మార్చి 3న కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖలో మొత్తం 811 టీఎంసీల్లో తెలంగాణకు 61 శాతం అంటే 575 టీసీఎంలను కేటాయించాలని అధికారికంగా చేసిన డిమాండ్‌ను ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర జలసంఘం అనుమతితో 165 టీఎంసీలతో రూపొందించిన చేవెళ్ల- ప్రాజెక్టును బీఆర్‌ఎస్ ప్రభుత్వం మేడిగడ్డకు మార్చడంతో రాష్ర్టంలో ఆర్థిక విపత్తు సంభవించిందని మండిపడ్డారు.
ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాలకు లోబడి ప్రాజెక్టును పునరుద్ధరిస్తామని, అయితే ప్రమాదకరంగా మారిన నిర్మాణాల్లో నీటిని నిల్వ చేయబోమన్నారు. ఎటువంటి కారణాలు లేకుండానే తుమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిన బీఆర్‌ఎస్ నేతలు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకే చేస్తున్న విమర్శలు ప్రజాక్షేత్రంలో నిలబడవన్నారు.
ఒక్క ఎకరాకు నీరివ్వలేదు: భట్టి
గోదావరి రీ డిజైన్ పేరుతో కాళేశ్వరం, ఇత ర ప్రాజెక్టులను నిర్మిస్తామంటూ రూ. 1.45 లక్షల కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసిందని, అయినా అదనంగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమ ర్శించారు. అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులకు వ్యవసాయ కాలువలను కూడా నిర్మించలేదని తెలిపారు.
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకొని బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేస్తుందని, 2004లో కృష్ణా నదిపై త్వరితగతన ప్రాజెక్టులు ప్రారంభించిందన్నారు. రాష్ర్ట ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని కృష్ణా నదిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే కృష్ణా జలాలపై మనకు పూర్తి సాధికారత, జలాల వినియోగంలో అధికారికంగా అధిక వాటా దక్కేదని పేర్కొన్నారు.
గోదావరి జలాల్లో కేవలం 42 వేల కోట్లు ఖర్చు చేస్తే ఇచ్చంపల్లి, తుమ్మిడిహెట్టి, తుపాకులగూడెం, దేవాదుల, ఇందిరా, రాజీవ్ సాగర్ ఈ ప్రాజెక్టులన్ని పూర్తయ్యేవని, తద్వారా తెలంగాణ రాష్ర్టంలో గోదావరి నదిపై 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని వివరించారు. గత పదేళ్లపాటు తెలం గాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పెద్దలు ఒక్క కాళేశ్వరం పైనే లక్ష కోట్లు తిని, నిధులు ఖర్చు చేశారు. కానీ నీళ్లు మాత్రం ఇవ్వలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిపై ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే బనకచర్ల సమస్య వచ్చేది కాదన్నారు.