calender_icon.png 10 July, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీనగర్‌పై హైడ్రా ఫోకస్

10-07-2025 01:19:00 AM

- బైరామల్ గూడ చెరువును పరిశీలించిన కమిషనర్ రంగనాథ్ 

- కబ్జాదారులకు ఎమ్మెల్యే అండదండలు 

- రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్‌రెడ్డి 

ఎల్బీనగర్/తుర్కయంజాల్, జూలై 9: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చెరువులపై హైడ్రా ఫోకస్ చేస్తున్నది. అనేక చెరువులు, కుంటలు కబ్జాలకు గురయ్యాయని, ఉన్న నీటి వనరులను కాపాడాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎల్బీనగర్ నియోజకవర్గం లోని చెరువుల కబ్జాలపై దృష్టి సారించారు. ఎల్బీనగర్ లోని బైరామల్ గూడ చెరువు కబ్జాకు సంబంధించి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన కమిషనర్ బృందంతో కలిసి బైరామల్ గూడ చెరువు కబ్జా అయిన స్థలాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరలో ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు.  మల్‌రెడ్డి రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. బైరామల్ గూడ చెరువు కబ్జాపై గతంలో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి ఎంపీగా, టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తీవ్రంగా స్పందించారని గుర్తు చేశారు. బైరామల్ గూడ చెరువును ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, తన అనుచరులు కబ్జా చేయడంతోనే హస్తినాపురం డివిజన్ లోని రెడ్డి కాలనీతో పాటు 150 కాలనీల నుంచి వచ్చే వరద నీరు వివిధ కాలనీల్లోని ఇండ్లకు చేరుతుందని ఆరోపించారు.

కాగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభ్యర్థన మేరకు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్చెరువు, దిలావర్ఖాన్ చెరువు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నాలాల కబ్జా వల్లే ముంపు సమస్య తలెత్తుతోందని ఆయన అన్నారు. మాసాబ్ చెరువు నాలాపై ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. ఇళ్లు నిర్మించుకున్నవారికి నష్టపరిహారం అందజేస్తామని రంగనాథ్ వెల్లడించారు. మాసాబ్చె రువు పైనుంచి కింద మూసీ వరకు 7.4కి.మీ. నాలా ఉన్నట్లు గుర్తించినట్లు రంగనాథ్ తెలిపారు. ఆయన వెంట నాయకులు యాదిరెడ్డి, గుండ్లపల్లి ధన్రాజ్గౌడ్, వంశీధర్రెడ్డి, బీజేపీ నేత బచ్చిగళ్ల రమేష్ తదితరులు ఉన్నారు.