calender_icon.png 8 September, 2025 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

08-09-2025 07:15:38 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కాగజ్ నగర్ మండలం బట్టుపల్లి గ్రామానికి చెందిన చాపిడి మీరాబాయి తనకు జారీ చేసిన పెన్షన్ పుస్తకంలో ఆధార్ నంబర్ సరి చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. జైనూర్ మండలం బుషిమెట్ట క్యాంపు గ్రామస్తులు తమ గ్రామంలోని చాలా మంది వృద్ధులకు పింఛన్ రావడం లేదని, మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

కాగజ్ నగర్ మండలం జంబుగా గ్రామానికి చెందిన డోంగ్రి రాంబాయి తమ తండ్రి పేరిట గల భూమిని వారసులము అయిన మాకు తెలియకుండా కొంత మంది పట్టా చేసుకున్నారని, అట్టి పట్టాను రద్దు చేసి సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గుర్లే సత్తయ్య తమ గ్రామము జాతీయ రహదారి నుండి కొండపల్లి వరకు గల రహదారిని మరమ్మత్తు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్ పట్టణం జనకాపూర్ కు చెందిన రమేష్ తాను దివ్యాంగుడనని, రేకుల ఇంటిలో ఉంటున్నందున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ మంగ్త్య నిరుపేద అయిన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు.

ఆసిఫాబాద్ పట్టణం జనకాపూర్ కు చెందిన జాదవ్ రోహిణి తన భర్త మరణించినందున వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. రాజంపేట కు చెందిన లక్ష్మీ స్వయం సహాయక సంఘ సభ్యులు తాను తీసుకున్న రుణము తిరిగి చెల్లించానని, నూతన ఋణము మంజూరు చేయించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే దిశగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు.