calender_icon.png 21 September, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంటాల ఇలవేల్పుగా.. గజ్జలమ్మ

21-09-2025 12:15:54 AM

-గ్రామంలోని సగం మందికి ‘గ’ అక్షరంతో నామకరణాలు

-అమ్మవారిని మెప్పించాకే ఇళ్లలో శుభాకార్యాలకు శ్రీకారం

పురాతన కాలంలో వెలసిన ఆలయంలోని అమ్మవారు  ప్రతి ఒక్కరినీ చల్లని చూపు చూస్తుందని ఆ గ్రామస్తుల విశ్వాసం. అందుకే.. ఆ గ్రామంలోని  ప్రతీ కుటుంబం ఏ శుభకార్యం చేయాలనుకున్నా.. ముందుగా గజ్జలమ్మ అమ్మవారి పండుగ చేయాల్సిందే.  అమ్మవారి మెప్పుపొందాకే ఏ కార్యమైనా మొదలుపెడతారు. ఇంకో విశేషం ఏంటంటే ఆ గ్రామంలో పుట్టిన పిల్లలకు గజ్జలమ్మ దేవత పేరు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలో సగం మంది జనాభాకు ‘గ’ అనే అక్షరంతో పేర్లు మొదలవుతుండడం విశేషం. కాలక్రమంలో ఆ ఊరి పేరు కూడా ‘కుంటాల గజ్జలమ్మ’గా మారిపోయింది. కుంటాల పేరు చెప్పగానే కుంటాల గజ్జలమ్మ ఊరా అంటూ ప్రత్యేకంగా చెప్పుకుంటారు.

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో వెలసిన కుంటాల గజ్జలవ్వ ఆలయానికి  ప్రతి ఆదివారం వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.  కుంటాల గజ్జలమ్మను ఇంటి ఇలవేల్పు దేవతగా గ్రామంలోని ప్రతి కుటుంబం కొలుస్తుంది.  

ఊరంతా అమ్మవారి పేరు

 కుంటాల గ్రామంలో మొత్తం 3000 పైగా జనాభా ఉండగా 2000 కుటుంబాలు ఉంటాయి.  ప్రతి ఇంటిలో ఒకరి పేరు గజ్జలమ్మ పేరునే ఉంటుంది. సుమారు 1500 పేర్లు ‘గ’ అనే అక్షరంతో అమ్మ పేరు మీద పెట్టుకుంటారు.  ఇందులో గజ్జవ్వ గజ్జలవ్వ గంగవ్వ గంగామణి గోదావరి పెద్ద గజరామ్ చిన్నగజరామ్ నడిపి గజారం గజేందర్ గణపతి గంగన్న, పెద్ద గజ్జరం చిన్నగజ్జరం నడిపి గజ్జరం పేర్లు ఉన్నాయి. కులం పేరు ముందుగా పెట్టి ఆ తర్వాత గజ్జరం పేర్లు పెట్టుకున్న వారి సంఖ్య చాలా ఉంటుంది. దీనికి తోడు గ్రామంలో ఉన్న కిరణా దుకాణాలు ఇతర వ్యాపార దుకాణాలు మహిళా సంఘాలకు యువజన సంఘాలకు గజ్జలవ్వ యువజన సంఘాలు మహిళా సంఘాలుగా నామకరణం చేసుకున్నారు.  ఇటీవలే ప్రభుత్వం కొత్త ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. దీంతో ఆలయం వద్ద కోనేరు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు.

ప్రతి ఏటా ఉత్సవాలు

కుంటాల మండల కేంద్రంలో గల గజ్జలవ్వ ఆలయంలో ప్రతి ఏటా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఆషాడ  బోనాలతో పాటు ఆలయ వార్షికోత్సవం, గజ్జలమ్మ పండుగ తదితర పేర్లతో వేడుకలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.  కుంటాల మండలానికి చెందిన కొన్ని కుటుంబాలు ఉద్యోగ, వ్యాపార రీత్యా నిర్మల్, బైంసా, ఆదిలాబాద్, హైదరాబాద్, నిజాంబాద్, వరంగల్ స్థిరపడ్డ అప్పటికి ప్రతి సంవత్సరం ఈ గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి గజ్జలమ్మ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లిస్తారు. అమ్మవారికి మొక్కు చెల్లిస్తే సమస్యలు సమసిపోతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం. అందుకే కుంటాల పేరు చెప్పగానే గజ్జలమ్మని మొదటగా అందరికీ గుర్తు వస్తుంది.

అమ్మవారి అక్షరంతోనే నామకరణం

 మా ఇంట్లో మొత్తం ఐదుగురికి అమ్మవారి అక్షరంతో పేర్లు పెట్టారు. నా పేరు కూడా గజేంద్రి. కుంటలలో చాలా మంది పేర్లు ‘గ’ అనే అక్షరంతోని పెట్టుకోవడం వల్ల గజ్జరామ్ అని పిలిస్తే పదిమంది పలుకుతారు. అందుకోసమే కులం పేరు ముందు పెట్టి గజ్జరం తర్వాత పేరు పిలుచుకుంటాం. 20 మంది పిల్లల పేర్లు ‘గ’ అనే అక్షరంతోనేఉన్నాయి.     

  ఈ గజేందర్ కుంటాల