calender_icon.png 21 September, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూలమ్మ ఇంట ఏడడుగుల బతుకమ్మ

21-09-2025 12:08:51 AM

మహబూబా బాద్‌లో పరకాల శ్రీనివాస్‌రెడ్డి కుటుంబం ఏటా అతిపెద్ద బతుకమ్మను పేరుస్తూ పండుగకు చిరునామాగా నిలుస్తోంది. శ్రీనివాస్‌రెడ్డి తల్లి పూలమ్మ 60 ఏళ్లకుపైగా ఏటా సద్దుల బతుకమ్మ రోజు ఏడు అడుగుల ఎత్తులో తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ తన పేరును సార్ధకం చేసుకుంటోంది. 80 ఏళ్ల వయసులో కూడా ఆమె బతుకమ్మను పేరుస్తూ ఇదే సాంప్రదాయాన్ని తన కోడలు హేమలత, మనురాలు ప్రదీపారెడ్డితో కొనసాగిస్తున్నారు.

తమ పూర్వికుల నుంచి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని, సద్దుల పండుగకు మూడు రోజుల ముందుగానే తీరక పూలను సేకరిస్తామని ఆమె చెప్పారు. ఇదే సాంప్రదాయాన్ని ఇకముందు కూడా తన వారసులు కొనసాగిస్తారని పూలమ్మ పేర్కొన్నారు.

బతుకమ్మ పాటల పుట్ట.. కేతమ్మ

ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయప్పునే గౌరమ్మ.. తంగేడు పువ్వప్పునే గౌరమ్మ.. తంగేడు కాయప్పునే గౌరమ్మ.. దేవతమ్మ .. దేవతమ్మ.. ఉయ్యాలో.. కొమ్మన పండున్నదో.. ఉయ్యాలో.. కోరితేమన్న ఇచ్చునో ఉయ్యాలో.. అందాల బతుకమ్మ.. రావే.. తెలంగాణలో పుట్టి.. పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే..

ఇలా ఒక్కటి రెండు కాదు.. పదుల సంఖ్యలో బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగల్లో కేతమ్మ కై కట్టి పాటలు పాడుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంకు చెందిన సుంకరబోయిన కేతమ్మ వ్యవసాయ పనులకు వెళ్లే క్రమంలో తోటి కూలీలతో కలిసి జానపదాలు పాడటం నేర్చుకుంది. అలా స్థానిక పరిస్థితులను అన్వయిస్తూ కైకట్టి పాటలు పాడుతూ గుంపు కూలీ మేస్త్రిగా ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగల్లో తన పాటలతో తెలంగాణ సంస్కృతిని తెలియజేస్తూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

కేతమ్మ

బతుకమ్మ పాట

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 

నా తెలంగాణ లోన ఉయ్యాలో

పల్లె పల్లె లోన ఉయ్యాలో 

పడుతులంతా గూడి ఉయ్యాలో 

ఆడేరు బతుకమ్మ ఉయ్యాలో 

పాటలెన్నో పాడి ఉయ్యాలో

పిల్ల పెద్దలంతా ఉయ్యాలో 


పూలన్ని కలబోసి ఉయ్యాలో

బతుకమ్మ కే పూవు ఉయ్యాలో

పనికి రాదు అనరు ఉయ్యాలో

అన్ని రంగుల పూలు ఉయ్యాలో

ఆమెకే సొంతము ఉయ్యాలో 

కాకతీయుల నాటి ఉయ్యాలో 

వాగులు, చెరువులు ఉయ్యాలో 

పూడికలు తీయించే ఉయ్యాలో 


పాడి పంటల తోటి ఉయ్యాలో 

పల్లెలు పచ్చంగా ఉయ్యాలో 

నీటి లోని కలువ ఉయ్యాలో 

నిలువెల్లా పులకించే ఉయ్యాలో 

స్వంత ఇల్లు చూసి ఉయ్యాలో 

అన్నదాత కంట్ల ఉయ్యాలో 

నీళ్లు రావద్దంటూ ఉయ్యాలో 

మెరుగైన వ్యవసాయం ఉయ్యాలో 


తెలంగాణ ఐతే ఉయ్యాలో

ప్రధమంగా ఉండాలె ఉయ్యాలో 

పిల్లల చదువులు ఉయ్యాలో 

చక్కంగా సాగాలే ఉయ్యాలో 

ఇంగ్లీషు చదువులు ఉయ్యాలో 

చదువుకున్న గాని ఉయ్యాలో 

తెలుగు భాష మరిచి ఉయ్యాలో 

మనమెప్పుడుండదు ఉయ్యాలో 

తెలివి తేటలలోన ఉయ్యాలో 

తెలంగాణ వాళ్లు ఉయ్యాలో 

మేధావులని చెప్పి ఉయ్యాలో

దేశమే పొగడాలే ఉయ్యాలో

 బొమ్మిదేని రాజేశ్వరి, 

పెద్దపల్లి

-------------------------------------------------------------------

* బతుకమ్మ అంటే మాకు బ్రతుకునిచ్చిన అమ్మ 

ఎవరో యాది తెచ్చికున్నారు నన్ను

పొలమారిన గొంతుతో మా ఊరి పొలిమేర చేరిన

ఒడినిండా పూల కమ్మదనాన్ని నింపుకొని

నాకు ఎదురై తెలంగాణ పండగొచ్చింది 

ఊరంతా సింగిడి పరిచిన పూల దారులతో 

నన్ను గుండెలకు హత్తుకుంది

ముసి ముసి నవ్వుల కమ్మదనంతో

పసి పాపల నవ్వుల ఆనందంతో

నా అడుగలు అప్పుడే పాలు తాగిన లేగదూడలయ్యాయి

మామిడాకుల ముత్యాల పందిరి మురిపంగ చూడగా

ముత్యాల ముగ్గులు సిగ్గుపడి నవ్వగా

పసిడి పూసిన తంగెడు నన్ను చేరగా

బతుకమ్మ నాకు తోడై నిలిచింది

గునుగు పూల గుసగుసల నవ్వులతో

మా వాడంతా విరగబూసిన బంతి పూల జాతరయ్యింది

నే బతుకమ్మన్న మోసిన క్షణం

నా బతుకు కమ్మదనం తెలిసొచ్చింది

నే మోసిన బతుకమ్మ కొండంత అండనిచ్చింది

జీవితమంటే తీరొక్క పూల లెక్కని

ఏ చిన్న కష్టానికే వెనకడుగు పడనియ్యకా

మా బతుకమ్మ నాకు బ్రతుకు నేర్పింది

ఏ జన్మలో ఏ పుణ్యమో!

తెలంగాణ మట్టి మీద బతుకమ్మనెత్తిన

నా అడుగుల దారికి చెరువమ్మ చేరువై

బారులు తీరిన జానపదాల ఆటపాటలతో

నా స్త్రీత్వం శక్తిగా మారింది

బతుకమ్మ అంటే మాకు ఇంకో బతుకునిచ్చిన అమ్మ 

 గుడ్ల దీప్తి, 7674870821