calender_icon.png 3 January, 2026 | 7:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

404 లక్షల కోట్ల రికార్డు విలువకు మార్కెట్

26-04-2024 12:14:30 AM

l ఐదు రోజుల్లో  రూ.11 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

l మరో 486 పాయింట్లు  పెరిగిన సెన్సెక్స్

ముంబై, ఏప్రిల్ 25: దేశీయ స్టాక్ మార్కెట్ విలువ గురువారం రూ.404.18 లక్షల కోట్ల చరిత్రాత్మక గరిష్ఠస్థాయికి చేరింది. వరుసగా ఐదు రోజుల్లో జరిగిన ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద రూ.11.29 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రికార్డు గరిష్ఠస్థాయి రూ. 4,04,18,411.32 కోట్లకు (4.87 ట్రిలియన్ డాలర్లు) చేరింది. వరుసగా ఐదో రోజు ర్యాలీ జరిపిన బీఎస్‌ఈ సెన్సెక్స్ గురువారం మరో 486 పాయింట్లు పెరిగి 74,339 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 74,571 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. వరుస ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,850 పాయింట్లు ర్యాలీ జరిపింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ తాజాగా 168 పాయింట్లు పెరిగి 22,570 పాయింట్ల వద్ద నిలిచింది. 

దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి నిధుల్ని వెనక్కుతీసుకుంటున్నా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ విజయం సాధిస్తుందన్న అంచనాలతో దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు జరుపుతున్నారని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పా రు. ఏప్రిల్ మంథ్లీ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు రోజున ఇన్వెస్టర్లు భారీగా బుల్లిష్ బెట్స్ తీసుకుని, వారి పొజిషన్లను మే నెల కు రోలోవర్ చేశారని, సూచీలు ర్యాలీ జరిపినట్టు వివరించారు. ఆసియా, యూరప్ సూచీలు పడిపోయినా, యూఎస్ డో జోన్స్ ఫ్యూచర్లు భారీగా తగ్గిన దేశీయ ఇన్వెస్టర్లు వెనుకంజ వేయలేదని వివరించారు. 

కొనసాగిన ఎఫ్‌పీఐల అమ్మకాలు

డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్ అధికస్థాయిలో ఉండటంతో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ వారం తొలి మూడు రోజుల్లో  రూ.7,500 కోట్ల వరకూ నికర విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) గురువారం మరో రూ.2,800 కోట్లు వెనక్కు తీసుకున్నట్టు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.