26-04-2024 12:13:02 AM
ముంబై, ఏప్రిల్ 25: కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రిజర్వ్‌బ్యాంక్ హఠాత్తుగా నియంత్రణలు విధించడంతో ఆ బ్యాంక్ మార్కెట్లో కలకలం సృష్టించింది. 10 శాతంపైగా పతనమై దాదాపు ఏడాది కనిష్ఠస్థాయి రూ.1,643 వద్ద ముగిసింది. క్షీణత కారణంగా కోటక్ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.39,769 కోట్ల సంపదను నష్టపోయారు. ఈ బ్యాంక్ వ్యవస్థాపకుడు, నాన్ డైరెక్టర్ అయిన ఉదయ్ కోటక్ ఈ క్రాష్‌తో రూ.10,225 కోట్లు కోల్పోయారు. కోటక్ బ్యాంక్‌లో ఉదయ్ కోటక్‌కు 25.71 శాతం వాటా ఉన్నది. ఆసియాలోనే శ్రీమంతుడైన బ్యాంకర్‌గా పేరొందిన ఉదయ్ కోటక్ సంపద బ్లూంబర్గ్ ఇండెక్స్ ప్రకారం ఏప్రిల్ 24న 14.4 బిలియన్ డాలర్లు. నిబంధనల ఉల్లంఘన, పాలనా లోపాలు జరిగినందున కొత్తగా క్రెడిట్ కార్డులు జారీచేయకుండా, నెట్‌బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త ఖాతాదారులను చేర్చుకోకుండా కోటక్‌పై రిజర్వ్‌బ్యాంక్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
నాలుగు నుంచి ఐదో స్థానానికి..
షేరు పతనంతో మార్కెట్ విలువరీత్యా కోటక్ మహీంద్ర బ్యాంక్ ఐదవ స్థానంలోకి దిగిపోయింది. నాల్గవ స్థానాన్ని మరో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ఆక్రమించింది. తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ విలువ రూ.3.66 లక్షల కోట్ల నుంచి రూ.3.26 లక్షల కోట్లకు పడిపోగా, యాక్సిస్ బ్యాంక్ మార్కెట్ విలువ రూ.4 లక్షల కోట్ల మేర పెరిగి రూ.3.48 లక్షల కోట్లకు చేరింది.