calender_icon.png 4 November, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడీలను ఎస్టీ నుంచి తొలగించాలి

04-11-2025 01:17:41 AM

-శీతాకాలం సమావేశంలో అసెంబ్లీ తీర్మానం చేయాలి

--ప్రభుత్వం స్పందించకుంటే ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి 

--ఆదివాసీ జేఏసీ చైర్మన్ శ్రీనివాస్, -వైస్ చైర్మన్ ఉపేందర్

ఏటూరునాగారం, నవంబర్ 3 (విజయక్రాంతి): లంబాడీలను ఎస్టీ జాబితా రిజర్వేషన్ నుంచి తొలగించాలని ఆదివాసి జేఏసీ చైర్మన్ పూణెం శ్రీనివాస్, వైస్ చైర్మన్ వట్టం ఉపేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో కుమ్రంభీం జక్షన్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ప్రకారం డోలి వాయిద్యాలతో దింస నృత్యం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ప్రాజెక్టు అధికారి చిత్ర మిశ్రాకు ఆదివాసీ సంఘాల రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పూణెం శ్రీనివాస్, వట్టం ఉపేందర్ మాట్లాడుతూ.. 1976లో ఆర్టికల్ 342 సబ్ క్లాస్ (2)కు విరుద్ధంగా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానం లేకుండా లంబాడా, బంజారాలను ఎస్టీలో చేర్చారని ఆరోపించారు.

దీంతో ఆదివాసీలకు దక్కవలసిన రిజర్వేషన్ ఫలాలు లంబాడ, బంజారాలకు ప్రభుత్వం కల్పిస్తున్నదని విమర్శించారు. తెలంగాణ ప్రాంతంలో లంబాడ, బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరారు. భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఐటీడీఏ కార్యాలయాలను ముట్టడిస్తామని, ప్రభుత్వాలు స్పందించకుంటే ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడించి, వంటావార్పు కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ శీతాకాలపు సమావేశాల్లోనే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.