calender_icon.png 7 September, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు లేకుండా పునరుద్దరణ

06-09-2025 11:41:08 PM

ఇబ్బందులు ఉన్న అగ్రికల్చర్​ కరెంట్​ సరఫరా

మెదక్ పిల్లికొట్టాల్​ సబ్​స్టేషన్​కు దుర్గా కాలనీ ఆవరణలో స్థలం కేటాయింపు

టీజీఎస్​సీపీడీసీఎల్​ చీఫ్​ ఇంజనీర్​ బాలస్వామి

మెద‌క్‌,(విజ‌య‌క్రాంతి): మెదక్​ జిల్లా వ్యాప్తంగా గత నెలలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాల కారణంగా విద్యుత్తు సరఫరాలో అధికారులు, సిబ్బంది నిరంతరం శ్రమించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పునరుద్దరుణ చర్యలు చేపట్టారని, ఈ విషయంలో వారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తించడం అభినందనీయమని పదకొండు ఉమ్మడి జిల్లాలకు చెందిన టీజీఎస్​సీపీడీసీఎల్​ చీఫ్​ ఇంజనీర్​ బాలస్వామి అన్నారు. శనివారం జిల్లా కేంద్రమైన మెదక్​ పట్టణంలోని ఎస్​ఈ కార్యాలయంలో విద్యుత్తు శాఖ జిల్లా ఎస్​ఈ నారాయణ నాయక్​, అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చీఫ్​ ఇంజనీర్​ బాలస్వామి మాట్లాడుతూ... జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో జిల్లా పరిధిలో మొత్తం 115 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోగా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ఇరవై నాలుగు గంటల్లోపే 110 గ్రామాలకు విద్యుత్తును పునరుద్దరించారని తెలిపారు. ఈ విషయంలో ఎస్​ఈ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు తమ బాధ్యతలను నిర్వర్తించారని కొనియాడారు. అలాగే ఇరవై నాలుగు గంటల్లోనే 259 స్తంభాలు, 14 విద్యుత్తు డిస్ట్రిబ్యూషన్​ ట్రాన్స్​ఫార్మర్లు అమర్చడంతో పాటు 11 కిలోమీటర్ల మేర లైన్లు వేసినట్లు చీఫ్​ ఇంజనీర్​ బాలస్వామి వివరించారు.

ఈ భారీ వర్షాలు, వరదల వల్ల వ్యవసాయ సరఫరాలో కొంత ఇబ్బందులు తలెత్తాయని వాటిని సైతం వెంటనే సరి చేశామని... అలాగే ప్రస్తుతం వ్యవసాయానికి సంబంధించి మరికొన్ని చోట్ల విద్యుత్తు పునరుద్దరణ జరగాల్సి ఉందని వీటిని సైతం రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించినట్లు... దీనికి గాను ప్రత్యేకంగా డీఈ స్థాయి అధికారులతో టీమ్​లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విషయంలో తమ శాఖ సీఎండీ ముషారఫ్​ అలీ ఫారూఖీ సూచనలు, సలహాలు పాటిస్తూనే ఎప్పటికప్పుడు చేపట్టిన పనులను వారి దృష్టికి తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

మెదక్​ పట్టణంలో నీట మునిగిన పిల్లికొట్టాల్​ సబ్​స్టేషన్​కు ప్రస్తుతం తాత్కాలికంగా రాజ్​పల్లి సబ్​స్టేషన్​ నుంచి విద్యుత్తు సరఫరా జరుగుతోందన్నారు. దీనికి సంబంధించి పిల్లికొట్టాల్​ సబ్​స్టేషన్​ను మార్చాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలతో ప్రభుత్వ పర్యవేక్షణలో మార్చడం జరుగుతుందని దీనికి జిల్లా కలెక్టర్​ రాహుల్ రాజ్​ పట్టణంలోని దుర్గాకాలనీ సమీపంలో సుమారు ఎకరా స్థలాన్ని కేటాయించారని, అందుకు సంబంధించి అలాట్​మెంట్​ రాగానే పనులు ప్రారంభించి పూర్తి చేయడం జరుగుతుందని చీఫ్​ ఇంజనీర్​ బాలస్వామి స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో ఇప్పటికీ ఎక్కడైనా వ్యవసాయ విద్యుత్తుకు సంబంధించి ఇబ్బందులు ఉంటే వాటిని సరి చేయడానికి ప్రత్యేక టీమ్​లను ఏర్పాటు చేసినట్లు వారి పర్యవేక్షణలో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో విద్యుత్తు పునరుద్దరణ జరుగుతుందని తెలిపారు.  

జిల్లాలో 6.09 మిలియ‌న్ యూనిట్ల విద్యుత్ వినియోగం..

ప్రస్తుతం జిల్లాలో 6.09 మిలియన్​ యూనిట్లు (ఆరు లక్షల యూనిట్ల) విద్యుత్తు వినియోగమవుతందని అందుకు సరిపోను అందచేస్తున్నామని... అలాగే జిల్లాలోని మీర్జాపల్లి, చల్మెడలో సబ్​స్టేషన్​లు పూర్తయ్యాయని త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల 39 ఫీడర్లలో 9 దెబ్బతినగా అందులో 7 సరి చేయగా... మరో రెండు ఫీడర్లు కాలువల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల పునరుద్దరించలేకపోయినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు...

ఈ సమయంలో మెదక్​ సర్కిల్​ 460 డీటీఆర్​లు ప్రభావితమవగా... 16 పూర్తిగా కొట్టుకుపోయాయని... 1,3,44 స్తంభాలు దెబ్బతిన్నాయని సుమారు రూ.13.5 కోట్లు నష్టం జరిగినట్లు చీఫ్​ ఇంజనీర్​ బాలస్వామి తెలిపారు. జిల్లాలో విద్యుత్తు కంట్రోల్​ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే 87124–73356 నెంబర్​కు ఫోన్​ చేయాలని చీఫ్​ ఇంజనీర్​ బాలస్వామి సూచించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా వర్షాలకు దెబ్బతిన్న సబ్​స్టేషన్లు, నూతనంగా నిర్మించనున్న సబ్​స్టేషన్లతో పాటు ఆయా ప్రాంతాలను పరిశీలించారు.