20-12-2025 12:05:54 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 19 (విజయక్రాంతి): నిత్యం రద్దీగా ఉండే పాతబస్తీలో గజం స్థలం దొరకడమే గగనం.. అలాంటిది ఏకంగా ఏడెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా కోరల్లో నుంచి హైడ్రా విడిపించి, మరోసారి సంచలనం సృష్టించింది. వందల కోట్ల విలువైన ఈ భూమిని ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసి, ఇనుప రేకులతో భారీ ప్రహరీ నిర్మించుకోగా.. శుక్రవారం హైడ్రా అధికారులు పోలీసుల సహకారంతో ఆక్రమణలను తొలగించారు. స్వాధీనం చేసుకున్న ఈ భూమి విలువ సుమారు రూ.400 కోట్లు ఉంటుందని యంత్రాంగం అంచనా వేసింది.
హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ విలేజ్ పరిధిలోని మొ హ్మద్‌నగర్, లలితాబాగ్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్- ఎఫ్, వార్డు నంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే రెండెకరాలు అన్యాక్రాంతమై నివాసాలు వెలిశాయి. మిగిలిన 7 ఎకరాలను కూడా ఆర్ వెంకటేష్ కుటుంబ సభ్యులు, పట్టాభి రామిరెడ్డి అనే వ్యక్తులు కబ్జా చేశారు.
లోపల ఏం జరుగుతుందో బయటకు కనిపించకుండా ఇనుప రేకులతో ఎత్తున భారీ ప్రహరీ నిర్మించారు. ఈ భూమి ప్రభుత్వానిదేనని రెవెన్యూ రికార్డులు చెబుతుండగా, కబ్జాదారులు మాత్రం తమదం టూ వాదిస్తూ వచ్చారు. వీరిపై భవానిపురం పోలీస్ స్టేషన్‌లో రెవెన్యూ అధికారులు గతంలోనే కేసులు పెట్టారు. అంతేకాకుండా, ఈ భూమి విషయంలో కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు న్యాయస్థానం గతంలో వీరికి కోటి రూపాయల జరిమానా కూడా విధించింది.
అయినా సరే వెరవకుండా, కోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ ప్లాట్లు వేసి అమ్మేందుకు ప్రయత్నించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలతో అధికారులు శుక్రవారం రంగంలోకి దిగారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చివేశారు. ఇనుప రేకుల ప్రహరీని తొలగించి, ఏడెకరాల భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ‘ఇది ప్రభుత్వ భూమి. ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు’ అని హెచ్చరిస్తూ అధికారులు బోర్డులు పాతారు.
చెరువును పునరుద్ధిస్తే వరదకు చెక్!
సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం ఆ ప్రాంతంలో ఒకప్పుడు చెరువు ఉండేది. కానీ కబ్జాదారులు దాని ఆనవాళ్లు లేకుండా మట్టితో పూడ్చేశారు. అక్కడి నాలాను, కుంటను కూడా ఆక్రమించారు. ఈ చెరువును, నాలాను పునరుద్ధరిస్తే పాతబస్తీలోని పలు కాలనీలకు వరద ముప్పు తప్పుతుందని, బమ్ చెరువు మాదిరి గా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.
హైడ్రా చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కుమ్మరివాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘రెండు కమ్యూనిటీల మధ్య సున్నితమైన ప్రాంతంలో కబ్జాదారులు రియల్ దందా చేస్తూ శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారు. హైడ్రా రాకతో మాకు విముక్తి లభించింది’ అని అన్నారు. కమిషనర్ రంగనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.