calender_icon.png 30 July, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలి

30-07-2025 01:39:26 AM

  1. జాతీయ మానవ హక్కుల చైర్మన్ జస్టిస్ వీ రామసుబ్రమణియన్
  2. ముగిసిన ఎన్‌హెచ్‌ఆర్సీ రెండు రోజుల సమావేశం

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): దేశంలో మంచి చట్టాలు ఉన్నాయని, వాటి ఫలితాలు ప్రజలకు నిజంగా అందాలంటే వాటిని పకడ్బందీగా అమలుచేయాలని జాతీయ మానవ హక్కుల(ఎన్‌హెచ్‌ఆర్సీ) చైర్మన్ జస్టిస్ వీ రామసుబ్రమణియన్ సూచించారు. రెండురోజుల పాటు జరిగిన ఎన్‌హెచ్‌ఆర్సీ శిబిర సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం సమన్వయంతో సహకరించిందన్నారు.

హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్సీలో రెండు రోజుల కార్యక్రమం మంగళవారం ముగిసింది. ఈసందర్భంగా రాష్ర్ట ప్రభుత్వ ముఖ్య అధికారులతో కమిషన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. రాష్ర్టంలోని ప్రధాన మానవ హక్కుల సమస్యలపై చర్చించి, వాటిని ఎదుర్కొనడంలో ప్రభుత్వ యంత్రాంగం చేపడుతున్న చర్యలు, సంక్షేమ చర్యల అమలును సమీక్షించడం లక్ష్యంగా సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వీ రామసుబ్రమణియన్ అధ్యక్షత వహించగా, కమిషన్ సభ్యులు జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, విజయభారతి సాయనీ, తెలంగాణ రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ డా.షమీమ్ అక్తర్, సీఎస్ కే రామకృష్ణారావు పాల్గొన్నారు. సమావేశంలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాలు, పోషకాహార లోపం, ప్రాథమిక విద్యలో లోపాలు, ఎస్సీ సంక్షేమం, రైతుల సమస్యలు, ఎల్జీబీటీక్యూఐప్లస్ హక్కుల అంశాలపై చర్చ జరిగింది. రాష్ట్ర హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా శాఖల సమన్వయానికి నేతృత్వం వహించారు.

అదనపు డీజీపీ (మహిళల భద్రత, సీఐడీ) చారుసిన్హా మహిళల భద్రత, ఎల్జీబీటీక్యూఐప్లస్ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇచ్చారు. సమావేశంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్, రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి సీ సువర్ణ, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ శిథిజ, పాఠశాల విద్యా కమిషనర్ నవీన్ నికోలస్, వ్యవసాయశాఖ డైరెక్టర్ బీ గోపి తదితర అధికారులు పాల్గొన్నారు.