calender_icon.png 30 July, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీలో ఆక్రమణల తొలగింపు

30-07-2025 01:38:11 AM

- 20 మీటర్ల మేర మట్టితో నింపి కబ్జా

- షెడ్లు వేసుకుని వ్యాపారం

- ఆక్రమిత స్థలాల్లో వాహనాల పార్కింగ్ దందా

- నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 29 (విజయక్రాంతి): మూసీ నది ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. దశాబ్దాలుగా మూసీ నదిలో 20 నుంచి 25 మీటర్ల మేర మట్టిని నింపి రోడ్డుకు సమాంతరంగా మార్చి సాగిస్తున్న అక్రమాలను మంగళవారం తొలగించింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ ఆపరేషన్ మధ్యాహ్నం 1 గంటకు పూర్తయింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి 9.62 ఎకరాల భూమిని రక్షించింది.

వాహనాల పార్కింగ్, పండ్ల నిల్వ కోసం ఫ్రీజర్ల ఏర్పాటు, నర్సరీ పేరిట జరుగుతున్న అక్రమ వ్యాపారానికి హైడ్రా అడ్డుకట్ట వేసింది. చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి పాతబస్తీలోని ఉస్మాని యా ఆసుపత్రి మార్చురీ వరకు పలు ప్రాం తాల్లోని ఆక్రమణలను తొలగించారు. మూసీ ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలోనే హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. షెడ్లు వేసుకుని నివాసముంటున్న వారి విషయంలో ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

కోర్టు ధిక్కరణ కేసులున్నా కబ్జాలు

మూసీ నదిని ఆక్రమించిన వారిలో తికారం సింగ్ (3.10 ఎకరాలు), పూనమ్ చాంద్ యాదవ్ (1.30 ఎకరాలు), జయకృష్ణ (5.22 ఎకరాలు) ఉన్నారు. వీరిపై ఇప్పటికే కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. ఈ కబ్జాలపై హైకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసి, ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించిం ది. కోర్టు ఉత్తర్వుల మేరకు అప్పటి హైదరాబాద్ కలెక్టర్ వారిపై కేసులు కూడా పెట్టారు. అయినప్పటికీ, కోర్టు ధిక్కరణతో పాటు పోలీసు కేసులకు వెరవకుండా వీరు కబ్జా కొనసాగించారు. ఆక్రమిత స్థలాన్ని వాహనాల పార్కింగ్ కోసం, పండ్ల నిల్వకు ఫ్రీజర్ల ఏర్పాటుకు, నర్సరీల పేరుతో వ్యాపారం చేయడానికి ఉపయోగించారు.

చిన్న షెడ్లు వేసుకుని కార్యాలయాలను కూడా నిర్వహించారు. ఒక్కో వాహనానికి రోజుకు రూ.300 వరకు వసూలు చేసి బస్సులు, లారీలను పార్కింగ్ కోసం వినియోగించారు. నిజాం కాలంలో మూసీ నదికి రాతితో కట్టిన రిటైనింగ్ వాల్ స్పష్టంగా ఉంది. అయినా కూడా నదిలోకి వేలాది లారీలతో మట్టిని, నిర్మాణ వ్యర్థాలను పోసి, రోడ్డుకు సమాంతరంగా మార్చేశారు. ఇలా దశాబ్దాలుగా మూసీ నదిలో మట్టిని పోసి 20 మీటర్ల ఎత్తుకు పై గా నింపారు. అఫ్జల్గంజ్ రహదారికి సమాంతరంగా నదిని మార్చేశారు. స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.