calender_icon.png 28 November, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్పంచ్ ల నుండి చట్టసభలకు

28-11-2025 04:37:26 PM

- వన్నె తెచ్చిన నేతలు

కరీంనగర్,(విజయ క్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చాలా మంది నేతలు సర్పంచ్ స్థానం నుండి చట్ట సభలకు ఎదిగారు. ఇందులో  దుద్దిళ్ల శ్రీపాద రావు అత్యున్నత స్పీకర్ పదవిని అలంకరించి ఆ పదవికే వన్నె తెచ్చారు. నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న శ్రీపాదరావు రాజకీయాల్లోకి అడుగిడాలని స్నేహితులు, హితులు ప్రోత్సహించారు. ఆ దిశగా అడుగులు వేస్తూ పోటి చేసి మొదటిసారి సర్పంచ్ గా ధన్వాడ నుండి ఎన్నుకోబడ్డారు. వరుసగా మరో మారు ఆయనకే ప్రజలు మద్దతు పలకడంతో రెండవ సారి ఎన్నికయ్యారు. మహాదేవపూర్ సమితి అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఎల్ఎంబీ ఛైర్మన్ పదవికి మంథని నుండి గెలిచాడు.

ఆయన రాజకీయ ఎదుగుదలకు ఎల్ఎంబీ బ్యాంకు ఛైర్మన్ ఎన్నిక ఎంతో సహకరించింది. దీంతో పూర్తిగా నియోజకవర్గానికే ఆయన సుపరిచితమైనాడు. పదవివస్తే ముఖంచాటేసుకునే నాయకులకు భిన్నంగా అయన ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్ట, నష్టాలలో పాలు పంచుకొని ప్రజానాయకునిగా ఎదిగారు. 1983 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటి చేసే అవకాశం లభించింది. అప్పుడే పురుడు పోసుకున్న తెలుగు దేశం పార్టీ ప్రభావం, ఎన్టిఆర్ ప్రభంజనం ముందు శ్రీపాదరావు విజయం సాధించారు.  తెలుగుదేశం, సంజయ్ విచార మంచ్ మధ్య ఎన్నికల ఒప్పందం కారణంగా మంథని శాసనసభ నియోజకవర్గం నుండి పోటిగా విచార మంచ్ నుండి చంద్రుపట్ల రాజి రెడ్డి దిగారు.

వీరిద్దరి మధ్య గట్టి పోటి నెలకొనగా చివరకు శ్రీపాదరావు విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసన సభ్యులుగాఎన్నికైన ఆయన శాసనసభ స్పీకర్ గా అన్ని పార్టీల మద్దతుతో పదవినధిష్టించారు. ఆ పదివికి వన్నె తెచ్చారని ఎంతోమంది ప్రముఖులు, రాజకీయా విశ్లేషకులతో ప్రశంశలు పొందారు. అలాగే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ కు చెందిన దివంగత వొడితెల రాజేశ్వర్ రావు సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.

జగిత్యాల జిల్లా అంతర్గాంకు చెందిన సుద్దాల దేవయ్య 1981లో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 1982లో తెలుగుదేశం పార్టీలో చేరి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. 1994, 1999 వరకు నేరెళ్ల ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇదే జిల్లా మెట్పల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన కొమిరెడ్డి రాములు సర్పంచ్ గా పనిచేసి ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. కరీంనగర్ జిల్లా గుండి గ్రామానికి చెందిన వెలిచాల రాజేందర్రావు తొలుత సర్పంచ్ పనిచేసి అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జువ్వాడి రత్నాకర్ రావు సర్పంచ్ గా పదేళ్లపాటు పనిచేసి 1981లో సమితి అధ్యక్షునిగా, 1989, 1999లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు.

పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి కూనారం గ్రామం నుండి 1970, 1976లో సర్పంచ్ గా గెలుపొంది అనంతరం 1981లో పెద్దపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 1985లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దేశిని చిన్న మల్లయ్య కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి సర్పంచ్ గా పనిచేసి ఆ తర్వాత 1984, 1989, 1994 వరుసగా మూడుసార్లు సీపీఐ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం తొలుత గంభీరావుపేట వార్డు సభ్యునిగా గెలుపొంది రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు, అనంతరం ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ విప్ ఆరెపల్లి మోహన్ 1988లో తొలిసారిగా సర్పంచ్ ఎన్నికై 2001 వరకు పనిచేశారు. 2006లో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు.

2009లో మానకొండూర్ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రభుత్వ విప్ గా పనిచేశారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితెల లక్ష్మీ కాంతరావు 1983 నుంచి 1995 వరకు సింగాపూర్ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2004లో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు వొడితెల సతీష్ కుమార్ కూడా సింగాపూర్ సర్పంచ్ గా పనిచేసి 2014, 2018లో హుస్నాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు గ్రామ పంచాయతీలో కారోబార్ గా పనిచేసి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇలా చాలామంది నేతలు సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యేలుగా గెలుపొంది రాజకీయంగా ఒక వెలుగు వెలిగారు.